మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 15:44:45

ముస్తాబ‌వుతున్న‌ అయోధ్య.. ల‌క్ష‌ ల‌డ్డూల పంపిణీ

ముస్తాబ‌వుతున్న‌ అయోధ్య.. ల‌క్ష‌ ల‌డ్డూల పంపిణీ

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య స‌ర్వాంగ‌సుంద‌రంగా ముస్తామ‌వుతున్న‌ది.  రామాల‌య భూమిపూజ సంద‌ర్భంగా.. శ్రీరామ జ‌న్మ‌భూమి ట్ర‌స్ట్ దివాళీ త‌ర‌హా సంబ‌రాల‌కు ఏర్పాట్లు చేస్తున్న‌ది.  భూమిపూజ వేడుక‌ల సంద‌ర్భంగా ల‌క్ష ల‌డ్డూ ప్యాకెట్ల‌ను ప్ర‌సాదంగా పంపిణీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగ‌స్టు 3వ తేదీన పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభం అవుతాయి. ఆగ‌స్టు 5వ తేదీన గ‌ర్భ‌గుడిలో పూజ‌లు నిర్వ‌హిస్తారు.  అయోధ్య‌లోని సాకేత్ కాలేజీ మైదానంలో మూడు హెలీప్యాడ్ల‌ను నిర్మిస్తున్నారు. రామాల‌యం నుంచి హ‌నుమాన్‌ఘ‌ర్హి ప్రాంతం మ‌ధ్య ఉన్న ఇండ్ల‌పై రామ‌క‌థా పేయింటింగ్‌ల‌ను వేస్తున్నారు. సాకేత్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్‌లో ప్ర‌ధాని మోదీ దిగుతారు.  

మ‌హావేడుక‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం కావ‌డంతో.. స‌ర‌యూ న‌ది తీరానికి వ‌స్తున్న భ‌క్తుల సంఖ్య కూడా పెరుగుతున్న‌ది. అయితే పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న రోజుల్లో సుమారూ ల‌క్ష ల‌డ్డూలు పంపిణీ చేసేందుకు ట్ర‌స్ట్ ఏర్పాట్లు చేసింది. ఉగ్ర‌వాదుల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలోనూ అయోధ్య‌లో ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్నారు. దేశ స‌రిహ‌ద్దుల్లో ఉన్న జిల్లాల‌కు కూడా హెచ్చ‌రికలు జారీ చేశారు.  ఆగ‌స్టు 3వ తేదీన గ‌ణేశుడి పూజ‌తో కార్య‌క్ర‌మాలు ప్రారంభం అవుతాయ‌ని ట్ర‌స్ట్ స‌భ్యుడు డాక్ట‌ర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఆగ‌స్టు 5వ తేదీన గ‌ర్భ‌గుడిలో జ‌రిగే పూజ కోసం 11 మంది పండితులు వేద‌మంత్రాలు చ‌ద‌వ‌నున్నారు. ప్ర‌ధాని మోదీ చేత వారు భూమిపూజ చేప‌డుతారు. 

  logo