బుధవారం 03 జూన్ 2020
National - May 18, 2020 , 01:11:11

ప్రతి తరగతికీ ఓ చానల్‌

ప్రతి తరగతికీ ఓ చానల్‌

  • ఆన్‌లైన్‌ చదువుకు ‘ప్రధాని ఈ-విద్య’  కార్యక్రమం
  • ఉపాధి హామీ పథకానికి రూ.40 వేల కోట్లు
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

న్యూఢిల్లీ, మే 17: ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించేందుకు ‘ప్రధాని ఈ-విద్య’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రతి ఒక్క తరగతికీ ఒక చానల్‌ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో భాగంగా ఆమె ఆదివారం చివరి విడుత కేటాయింపుల వివరాలను వెల్లడించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.40 వేల కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రజారోగ్య రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. 

ఆన్‌లైన్‌ కోర్సులకు 100 వర్సిటీలకు అనుమతి

ఇంటర్నెట్‌ వసతి లేని విద్యార్థులకు చేరువయ్యేందుకు స్వయం ప్రభ డీటీహెచ్‌ చానెళ్లద్వారా విద్యాబోధన అందించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు చానళ్లతోపాటు పాఠశాల విద్య కోసం అదనంగా మరో 12 చానళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.  ఈ విషయమై ప్రైవేట్‌ డీటీహెచ్‌ ఆపరేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు. డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోత్సహించేందుకు పీఎం ఈ-విద్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మే 30 నాటికల్లా ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించేందుకు టాప్‌ 100 యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో ఎలాంటి మహమ్మారులు ఎదురైనా..

ప్రజారోగ్య రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మల వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హెల్త్‌, వెల్‌నెస్‌ సెంటర్లను త్వరితగతిన ఏర్పాటుచేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారులు వచ్చినా భారత్‌ ఎదుర్కొనేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.  అన్ని జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ సంబంధింత దవాఖానలు, అన్ని జిల్లాలు, బ్లాక్‌ స్థాయిలో సమీకృత ప్రజారోగ్య ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐసీఎంఆర్‌ ద్వారా దేశంలో పరిశోధనలను ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ను అమలుచేయనున్నట్లు తెలిపారు. అదనంగా 300 కోట్ల పనిదినాలు

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.40,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలు స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న నేపథ్యంలో వారికి ఉపాధి కల్పించేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీని వల్ల సుమారు 300 కోట్ల పనిదినాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేశామని ఆర్థికమంత్రి నిర్మల తెలిపారు. ఇందులోభాగంగా 2.2 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ.3,950 కోట్లు అందజేసినట్లు చెప్పారు. అలాగే 20 కోట్ల జన్‌ధన్‌ ఖాతాల్లోకి రూ.10,025 కోట్లు బదిలీ చేసినట్లు తెలిపారు. 6.81 కోట్ల మందికి ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందజేసినట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు 12 లక్షల మంది ఈపీఎఫ్‌వో చందాదారులు రూ.3,360 కోట్ల మేర వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. 

రాహుల్‌వి డ్రామాలు

వలస కార్మికుల అవస్థలపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తిప్పికొట్టారు. ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు 1500కు పైగా రైళ్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం అన్ని రాష్ర్టాలకు సమాచారామిచ్చినా.. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల పాలనలోని రాష్ర్టాలు ఎందుకు రైళ్లను పంపాలని కోరడం లేదని ప్రశ్నించారు. శనివారం ఢిల్లీలో స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలను ఆపి రాహుల్‌గాంధీ వారితో మాట్లాడడాన్ని ఆమె  పరోక్షంగా ప్రస్తావించారు. ‘స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలను ఆపి, వారితో మాట్లాడుతూ వారికి మరింత కష్టం కలిగించే బదులు.. వారి సామగ్రి లేదా పిల్లలను ఎత్తుకుని వారితోపాటు నడిస్తే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించారు. 


logo