గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 21, 2020 , 12:42:14

స‌రిహ‌ద్దుల్లో పాక్ కాల్పులు.. సైనికుడి వీర‌మ‌ర‌ణం

స‌రిహ‌ద్దుల్లో పాక్ కాల్పులు.. సైనికుడి వీర‌మ‌ర‌ణం

శ్రీన‌గ‌ర్‌: నియంత్ర‌ణ రేఖ‌వెంబ‌డి పాక్ దుశ్చర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. కాల్పుల‌‌ విర‌మ‌ణ ఒప్పందానికి దాయాది దేశం మ‌రోమారు తూట్లు పొడిచింది. జ‌మ్ముక‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాక్ సైనికులు జ‌రిపిన కాల్పుల్లో భార‌త జ‌వాన్ అమ‌రుడ‌య్యారు. ‌నౌషెరా సెక్టార్‌లోని లామ్ ప్రాంతంలో స‌రిహ‌ద్దుల అవ‌త‌లివైపు నుంచి నిన్న‌ అర్థ‌రాత్రి 1 గంట‌ల‌కు పాక్ కాల్పులు ప్రారంభించింద‌ని భార‌త సైన్యం వెల్ల‌డించింది. ఈ కాల్పుల్లో 16 కార్ప్‌కు చెందిన హ‌వ‌ల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీ తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని, ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయార‌ని వెల్ల‌డించింది. కాగా, పాక్ కాల్పులను భార‌త సైన్యం స‌మ‌ర్థంగా తిప్పికొట్టింద‌ని తెలిపింది.    

జ‌మ్ములో నలుగురు ఉగ్ర‌వాదులను హ‌త‌మార్చిన రెండు రోజుల త‌ర్వాత పాక్ అప్ర‌క‌టిత‌ కాల్పుల‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. గురువారం ఉద‌యం జ‌మ్ము జిల్లాలోని న‌గ్‌రోటా ప్రాంతంలో జ‌మ్ము-శ్రీన‌గ‌ర్ జాతీయ‌ర‌హ‌దారిపై ఉన్న బాన్ టోల్‌ప్లాజా వ‌ద్ద ఓ ట్ర‌క్కులో దాక్కున్న ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో భ‌‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిపిన ఎదురు కాల్పుల్లో న‌లుగురు ముష్క‌రులు హ‌త‌మైన విష‌యం తెలిసిందే.