శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 18:26:33

ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అందరికీ ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌ టీకా: ఎస్‌ఐఐ

ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అందరికీ ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌ టీకా: ఎస్‌ఐఐ

ముంబై: దేశంలో కొవిడ్‌ టీకా విజయవంతమైతే ప్రభుత్వం ద్వారానే పంపిణీ చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద టీకా తయారీదారుగా పేరుగాంచిన ఈ సంస్థ టీకా అందరికీ లభిస్తుందని భరోసా ఇచ్చింది. తమ పార్సీస్‌ వర్గంకోసం టీకాలను ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచుతాం అని ఆ సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా ట్వీట్‌ చేసిన మరుసటిరోజే దీనిపై ఎస్‌ఐఐ వివరణ ఇచ్చింది. 

‘అది ఇద్దరు పార్సీల మధ్య జరిగిన స్నేహపూర్వక సంభాషణ. ఒకసారి టీకా ఒకే అయితే అందరికీ అందుబాటులో ఉంచుతాం.’ అని ఎస్‌ఐఐ లిఖిత పూర్వక ప్రకటనలో తెలియజేసింది. టీకా తయారీ పూర్తికాగానే ప్రభుత్వమే దీన్ని సేకరించి, పంపిణీ చేస్తుందని పేర్కొంది. ప్రజలు ఈ టీకాను కొనాల్సిన అవసరముండదని తెలిపింది.  భారత్‌లో టీకా తయారీకి ఎస్‌ఐఐను ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, దాని భాగస్వామి ఆస్ట్రాజెన్‌కా ఎంపిక చేశాయి.

ఎస్‌ఐఐ ఈ టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఆగస్టులో నిర్వహిస్తామని ప్రకటించింది.  అలాగే, దేశంలో రెండు, మూడో క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోరుతూ లేఖ రాసింది. పుణె, ముంబైలో ఈ ట్రయల్స్‌ నిర్వహించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఆగస్టు చివరి నాటికి పుణె, ముంబైలలో 4,000 నుంచి 5,000 మందికి టీకా ఇంజెక్ట్ చేయనున్నట్లు ఎస్‌ఐఐ ఇదివరకే ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ఈ టీకా పరీక్షా ఫలితాలపై సంతృప్తికర పురోగతిని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. ఎస్‌ఐఐ కూడా టీకా అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటున్నది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo