మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 07:12:25

ప్రధా‌నిగా మోదీ రికార్డు.. నేటితో 2,273 రోజులు పూర్తి

ప్రధా‌నిగా మోదీ రికార్డు.. నేటితో 2,273 రోజులు పూర్తి

న్యూఢిల్లీ: ఎర్ర‌కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసే ముందు రోజు ప్ర‌ధాని మోదీ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పారు. కాంగ్రె‌సే‌తర ప్రధా‌న‌మం‌త్రుల్లో అత్య‌ధి‌క‌కా‌లం‌పాటు పద‌విలో ఉన్న వ్యక్తిగా మోదీ రికార్డుల్లో నిలిచార‌ని బీజేపీ పేర్కొంది. ‘మూ‌డు‌సార్లు ప్రధా‌నిగా పని చేసిన బీజేపీ నేత వాజ‌పేయి 2,273 రోజులు ఆ పద‌విలో కొన‌సా‌గారు. ఆ రికా‌ర్డును ఈ రోజు మోదీ అధి‌గ‌మిం‌చారు’ అని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌‌చార్జీ ట్వీట్ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సుదీర్ఘ కాలం దేశ ప్రధా‌ను‌లుగా జవ‌హ‌ర్‌‌లాల్‌ నెహ్రూ, ఇంది‌రా‌గాంధీ, మన్మో‌హన్‌ సింగ్‌ సేవ‌లం‌దిం‌చారు.

వాజ్‌పేయి మొద‌టిసారిగా 1996, మే 16న ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే ఆయ‌న ప్ర‌భుత్వం 13 రోజుల్లోనే కూలిపోయింది. దీంతో ఆయ‌న రెండువారాల్లోపే ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే మ‌రో మూడురోజులపాటు అంటే జూన్ 1 వ‌ర‌కు ఆయ‌న ప్ర‌ధానిగా కొన‌సాగారు. రెండోసారి 1998, మార్చి 19 నుంచి 2004, మే 22 వ‌ర‌కు అంటే 1,257 రోజులు ప్ర‌ధానిగా ప‌నిచేశారు. మొత్తంగా ఆయ‌న 2,273 రోజుల‌పాటు దేశ‌ప్ర‌ధానిగా ఉన్నారు. 

ప్ర‌ధానిగా మోదీ 2014, మే 26న బాధ్య‌త‌లు చేపట్టి 2020, ఆగ‌స్టు 14 నాటికి 2,273 రోజులు పూర్త‌వుతుంది. అంటే ఆయ‌న ఆగ‌స్టు 15న మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి కంటే ఎక్కువ కాలం ప‌దవిలో కొన‌సాగిన ప్ర‌ధానిగా వ్య‌క్తిగా నిలుస్తారు.  

భార‌త‌దేశానికి కాంగ్రేసేత‌ర ప్ర‌ధానులుగా మోరార్జీ దేశాయ్‌, చ‌ర‌ణ్ సింగ్‌, వీపీ సింగ్‌, చంద్రశేఖ‌ర్‌, హెచ్‌డీ దేవేగౌడ‌, ఐకే గుజ్ర‌ల్ ప‌నిచేశారు. అయితే వీరిలో ఏ ఒక్క‌రూ పూర్తిగా ఐదేండ్ల‌పాటు ప‌ద‌విలో కొన‌సాలేదు.


logo