బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 07:54:47

అనుమానంతో భార్య చేయి విర‌గ్గొట్టిన వృద్ధుడు!

అనుమానంతో భార్య చేయి విర‌గ్గొట్టిన వృద్ధుడు!

బెంగ‌ళూరు: అనుమానం ఆలుమ‌గ‌ల మ‌ధ్య అగ్గి రాజేస్తుంది. ప‌చ్చ‌ని కాపురాల్లో చిచ్చు పెడుతుంది. జంట పావురాల్లా క‌లిసి ఉన్న దంప‌తుల‌ను సైతం బ‌ద్ధ శ‌త్రువుల‌ను చేస్తుంది. అందుకే అనుమానం పెనుభూతం అంటారు. అయితే ఇలాంటి అనుమానాలు కొత్త జంట‌ల్లో ఉండ‌టం స‌హ‌జం. బెంగ‌ళూరులో మాత్రం 75 ఏండ్ల వృద్ధుడికి భార్య‌పై అనుమానం వ‌చ్చింది. 44 ఏండ్ల‌పాటు క‌లిసి కాపురం చేసిన భార్య‌పై అనుమానం పెంచుకున్నాడు. నిత్యం గొడ‌వ‌ప‌డి ఆఖ‌రికి ఆమె చేయి విర‌గ్గొట్టాడు.  

బెంగ‌ళూరుకు చెందిన 75 ఏండ్ల వృద్ధుడు స‌చివాల‌యంలో ప‌నిచేసి 15 ఏండ్ల క్రితం రిటైర్ అయ్యాడు. పిల్ల‌లు ఇత‌ర ప్రాంతాల్లో స్థిర‌ప‌డ‌టంతో ఆ వృద్ధుడు భార్య‌తో (69 ఏండ్ల వృద్ధురాలు) క‌లిసి న‌గ‌రంలోని సొంతింట్లో ఉంటున్నాడు. అయితే ఇటీవ‌ల వారు త‌మ పై పోర్ష‌న్‌ను ఓ కొత్త‌జంట‌కు అద్దెకిచ్చారు. కొన్ని రోజుల క్రితం అద్దెకు దిగిన యువ‌తి డెలివ‌రీ కోసం త‌ల్లిగారింటికి వెళ్లింది. దీంతో ఆ యువ‌కుడికి వృద్ధురాలు వంట ప‌నుల్లో సాయం చేస్తున్న‌ది. 

అయితే, యువ‌కుడితో వృద్ధురాలు స‌న్నిహితంగా ఉండ‌టాన్ని ఆ వృద్ధుడు భ‌రించ‌లేక‌పోయాడు. న‌ల‌భై నాలుగేండ్లు కాపురం చేసిన మ‌నిషిపైన నాలుగు రోజుల్లోనే అనుమానం పెంచుకున్నాడు. నిత్యం వేధించి చివ‌రికి ఆమె చేయి విర‌గ్గొట్టాడు. దీంతో వృద్ధురాలు బెంగుళూరు పోలీసులను ఆశ్రయించింది. పరిహార్ హెల్ప్‌లైన్‌కి ఫోన్‌చేసి ఈ వయసులో త‌న‌పై అనుమానం పెంచుకుని చేయి విరగ్గొట్టాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo