శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 13:47:52

ఏడు పదుల వయసులో సైకిల్‌పై సాహసం

ఏడు పదుల వయసులో సైకిల్‌పై సాహసం

డెహ్రాడూన్‌ : ఏడు పదుల వయసు.. 43 ఏళ్ల దాంపత్య జీవితం.. సైక్లింగ్‌పై అమితాసక్తి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలను చుట్టొచ్చిన ఈ వృద్ధ జంట సైకిల్‌ సవారీపై  ప్రపంచ యాత్ర చేయాలని సంకల్పించింది. గత ఐదేళ్లుగా వారానికి సగటున 300 నుంచి 400 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేస్తున్నది ఈ జంట. 

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని  రిషికేశ్‌కు విశ్వ ధీమాన్‌ (71), కమల్‌ జీత్‌ ధీమాన్‌ (72) దంపతులు. వీరికి వివాహం జరిగి 43 ఏళ్లయింది. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కమల్‌ జీత్‌ వ్యాపార వేత్త కాగా, విశ్వ ధీమాన్‌ మూడు దశాబ్దాలు బోధనా వృత్తిలో కొనసాగిన ఆమె ఉద్యోగ విరమణ చేసి, ప్రశాంత జీవితం గడుపుతున్నారు. 2006 సంవత్సరంలో జరిగిన ప్రమాదం వారికి తీవ్ర అంతరాయం కలిగించింది. 2013లో విశ్వ ధీమాన్‌ ఇంటి పైకప్పు నుంచి పడిపోయింది. ఆమె త్వరలోనే కోలుకున్నప్పటికీ, వెన్నునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.  మోకాళ్ల నొప్పితో డాక్టర్‌ను సంప్రదిస్తే వృద్ధాప్యంతోనేనని చెప్పాడు. దీంతో నొప్పులతో కాలం వెళ్లదీస్తుండగా.. వారికి పరిష్కారంగా సైకిల్‌ తొక్కమని ఆమె కొడుకు ఇచ్చిన సలహా వారి జీవితాన్ని మార్చింది. ‘నా కొడుకు సైకిల్ తొక్కుతూ, నన్ను కూడా తొక్కమని సలహా ఇచ్చినప్పుడు నేను నిరాశతో, చీకట్లో నిస్పృహతో ఉన్నాను. నాకు ఎప్పుడూ ఉన్నతమైన ఆశలు లేదా కలలు ఉండేవి కాదు. కానీ సైక్లింగ్ నాకు పెద్ద కలలు కనడం నేర్పింది’ అని ధీమాన్ చెప్పారు. ఈ జంట ఆరోగ్య సమస్యలకు ఒక పరిష్కారంగా సైక్లింగ్‌ను ప్రారంభించగా, అది ఇప్పుడు ఒక అభిరుచిగా మారింది. దాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేరు.  

దేశంలోని పలు ప్రాంతాలను సైకిల్‌ చుట్టొచ్చిన జంట

విశ్వ ధీమాన్, కమల్ జీత్ ధీమాన్ జంట మనాలి నుంచి 610 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖాదుంగ్‌లా వరకు, కులు నుంచి 350 కిలోమీటర్లు జలోరి పాస్‌, డెహ్రాడూన్‌ నుంచి కేదార్‌నాథ్‌, గంగోత్రి తదితర కష్టతరమైన ప్రాంతాలను సైకిల్‌పై చుట్టి వచ్చారు. ఈ జంట ఈశాన్య, దక్షిణ రాష్ట్రాలతో సహా భారతదేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రానికి సైకిల్‌పై ప్రయాణించారు. ఇప్పుడు మేం కలిసి ప్రపంచవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేయాలనుకుంటున్నాము’ అని విశ్వ ధీమాన్‌ చెప్పారు. ఈ వృద్ధ జంట అర దశాబ్దానికిపైగా ప్రతి వారం సగటున 300-400 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నది. మనాలి నుంచి 17582 అడుగుల ఎత్తులో ఉన్న ఖాదూంగ్‌లా వరకు 2018లో చేసిన సైక్లింగ్‌ నుంచి తన అనుభావాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘రోడ్డు వెంట ప్రజలంతా మమ్మల్ని ఆపి.. ఈ వయసులో ఎలా సాధ్యమవుతుందని’ అడిగే వారని చెప్పింది. ‘ఖాదూంగ్‌లా సాహస యాత్ర డైరెక్టర్‌ తమకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా లేరని, ప్రదర్శన చూసిన తర్వాత అతను మమ్మల్ని మళ్లీ ప్రశ్నించలేదు’ అని మూడు సంవత్సరాల క్రితం యోగాలో మాస్టర్స్ పూర్తి చేసిన కమల్‌ జీత్‌ ధీమాన్‌’ చెప్పారు.

లాక్‌డౌన్‌ అనుభవం గురించి..

వృద్ధ జంట తమ లాక్‌డౌన్‌ అనుభవం గురించి వివరించింది. యోగా, వ్యాయామం, రన్నింగ్‌ తదితర పనుల ద్వారా అధిగమించినట్లు చెప్పారు.  తెల్లవారు జామున 5 గంటలకు ఈ జంట దినచర్య ప్రారంభమవుతుంది. యోగా చేసుకొని అనంతరం రోజువారీ పనులు చేసుకొని, అనంతరం ౩౦-40  కిలోమీటర్లు దూరం వరకు వెళ్లేందుకు మార్గాన్ని ఎంచుకుంటారు. అప్పుడప్పుడు ఇంకా ఎక్కువగానే వెళ్లి వస్తుంటారు. పలు పోటీల్లోనూ పాల్గొని బహుమతులు కూడా అందుకున్నారు. ఈ ఘనతను వారు తమ పిల్లలకే ఇచ్చారు. మలి దశలో సైక్లింగ్‌ చేసేందుకు ప్రోత్సహించినందుకు. విశ్వ ధీమాన్‌ ఆమె యాత్రలు, జీవన శైలిని చెప్పేందుకు గతేడాది ‘నెవర్‌ టూ లేట్‌ 62’ పేరిట ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను కూడా ప్రారంభించారు. ‘ కలలను సాధించడానికి జీవితంలో ఎప్పుడూ ఆలస్యం కాదని.. నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ కలలు కనడం, వాటిని సాధించడం నేర్చుకోవాలి’ అని సూచిస్తున్నది వృద్ధ జంట.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo