శనివారం 28 మార్చి 2020
National - Feb 29, 2020 , 02:41:02

లెక్కలు తేలేదెలా?

లెక్కలు తేలేదెలా?
  • ఏప్రిల్‌ 1 నుంచి ఎన్పీఆర్‌, తొలి దశ జనగణన ప్రారంభం
  • ఎన్పీఆర్‌లో కొత్త ప్రశ్నలజోడింపుతో గందరగోళం
  • స్పష్టతనివ్వని కేంద్ర ప్రభుత్వం
  • షెడ్యూలు దగ్గర పడుతుండటంతోప్రక్రియను వాయిదా వేస్తున్న పలు రాష్ర్టాలు
  • సీఏఏ, ఎన్నార్సీ వివాదమయం

నేషనల్‌ డెస్క్‌: కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ.. దాన్ని తమ దగ్గర అమలు చేయబోమని ఇప్పటికే పదుల సంఖ్యలో రాష్ర్టాలు నిర్ణయించాయి. ఇదిలా ఉండగా గతంలో ఉన్న జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)కు కేంద్రం కొత్త ప్రశ్నలు జోడించడం అగ్నికి ఆజ్యం పోసినైట్టెంది. ‘ఎన్నార్సీ తయారీకి ఎన్పీఆర్‌ ప్రాతిపదిక’ అని ఆరోపిస్తూ.. పశ్చిమబెంగాల్‌, కేరళ తదితర రాష్ర్టాలు ఎన్పీఆర్‌ ప్రక్రియను తమ రాష్ర్టాల్లో అమలు చేయబోమని ప్రకటించాయి. ఎన్పీఆర్‌ విషయంలో సమాజంలోని పలు వర్గాల్లోనూ సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, షెడ్యూల్‌ను అనుసరించి ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య ఎన్పీఆర్‌, జనగణన(తొలి దశ-హౌస్‌హోల్డ్‌ సర్వే) ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఎన్పీఆర్‌, జనగణన, ఎన్నార్సీ, సీఏఏల మధ్య తేడా, తదితర అంశాలపై పరిశీలన.


ఎన్పీఆర్‌అంటే ఏమిటి?

దేశంలోని సాధారణ నివాసుల వివరాలతో కూడిన ఒక పట్టిక. ప్రతి ఐదేండ్లకోసారి ఎన్పీఆర్‌ సవరణ జరుగుతుంది.

ఏ చట్టం ప్రకారం?

పౌరసత్వం చట్టం-1955 పరిధిలో పౌరసత్వ నిబంధనలు, 2003 ఆధారంగా ఎన్పీఆర్‌ను రూపొందిస్తారు. 

ఎందుకు?

ఒక నివాసిత ప్రాంతంలో గత ఆరునెలలుగా నివసిస్తున్న, లేదా వచ్చే ఆరునెలలు నివసించాలనుకొంటున్న వ్యక్తుల వివరాలను సేకరించడం ఎన్పీఆర్‌ ప్రధాన ఉద్దేశం

వివాదం ఏమిటి?

గత ప్రభుత్వాలు అనుసరించిన ఎన్పీఆర్‌ నమూనాకు కొన్ని ప్రశ్నలు జోడించి సవరించిన నమూనాతో కొత్త ఎన్పీఆర్‌ను మోదీ సర్కార్‌ తీసుకురావడంతో పలు రాష్ర్టాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జోడించిన ప్రశ్నలను చట్టంలోని ఏ సెక్షన్‌ ప్రకారం చేర్చిందో కేంద్రం స్పష్టతనివ్వకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. మాతృభాష, వ్యక్తి, తల్లిదండ్రులు పుట్టిన ప్రదేశం, గతంలో నివసించిన ప్రాంతంతో పాటు ఆధార్‌ వివరాలు(ఐచ్చికం), ఓటరు గుర్తింపు కార్డు వివరాలు, పాసుపోర్టు, మొబైల్‌ నంబర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబరు తదితర ప్రశ్నల్ని కొత్తగా జోడించారు. 


ఎన్నార్సీ  అంటే ఏమిటి?

చట్ట ప్రకారం భారతీయ పౌరులుగా నమోదైన వారి జాబితాయే ఎన్నార్సీ. ఈ పట్టికను మొట్టమొదటిసారిగా 1951లో ప్రభుత్వం రూపొందించింది. అసోంలో మినహా.. ఇప్పటి వరకు దీన్ని ఎక్కడా మళ్లీ నవీకరించలేదు.


ఏ చట్టం ప్రకారం?

పౌరసత్వ సవరణ చట్టం 2003 ఆధారంగా నిర్వహిస్తారు. 

ఎందుకు?

చట్టబద్ధమైన భారతీయ పౌరులు ఎవరో తెలుసుకోవడమే ప్రధానోద్దేశం. 

వివాదం ఏమిటి?

అక్రమవలసదారుల్ని గుర్తించి దేశం నుంచి వెనక్కి పంపించటమే ఎన్నార్సీ లక్ష్యమని పేర్కొంటారు. అయితే, సరైన వివరాలు సమర్పించలేదన్న కారణంతో అసోంలో గత కొన్నేండ్లుగా నివసిస్తున్న వేలాది మంది పౌరుల్ని జాబితా నుంచి తొలిగించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వివాదం రాజుకున్నది. 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ తరుఫున పోరాడిన రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి మహమ్మద్‌ సనావుల్లా పేరు సైతం జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది.


జనగణన (సెన్సస్‌)అంటే ఏమిటి?

దేశంలో నివసిస్తున్న జనాభా సంఖ్యను తెలియజేసేదే జనగణన. ప్రతి పదేండ్లకొకసారి దీన్ని చేపడుతారు. జనగణనకు సన్నాహకంగా హౌస్‌హోల్డ్‌ సర్వే నిర్వహిస్తారు. దీన్ని ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌ నడుమ చేపట్టనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 9, 2021 నుంచి జనగణన ప్రక్రియ చేపట్టనున్నారు.

ఏ చట్టం ప్రకారం?

జనగణన చట్టం-1948 ఆధారంగా నిర్వహిస్తారు

ఎందుకు?

దేశంలోని పౌరుల గణాంక సమాచారంతో పాటు, గత దశాబ్దంలో దేశం సాధించిన పురోగతి, ప్రభుత్వ పథకాల అమలు వంటివి తెలుసుకోవడం దీని ఉద్దేశం. 

వివరాలు

వ్యక్తి గృహ వివరాలు, ఇంటి నిర్మాణం, కుటుంబ సభ్యుల వివరాలు, గృహోపకరణాల వివరాలు, ఆదాయ మార్గాలు, వ్యవసాయ- వ్యవసాయేతర వర్గాలు, సాగు, తాగు నీటి లభ్యత, ఎస్సీ, ఎస్టీ వివరాలు(రిజర్వేషన్ల కోసం), భాష, మతం, దివ్యాంగత.. తదితర సమాచారాన్ని సేకరిస్తారు.


సీఏఏ-2019

పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో మత వివక్షకు గురై 2014 డిసెంబర్‌ 31 కంటే ముందు భారత్‌కు వలస వచ్చిన హిందు, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ, క్రైస్తవులకు(స్థూలంగా ముస్లిమేతరులకు) కొన్ని నిబంధనలకు లోబడి భారత పౌరసత్వం ఇవ్వడమే దీని ప్రధానోద్దేశం. 

ఏ చట్టం ప్రకారం?

1955 పౌరసత్వ చట్టానికి పలు సవరణలు చేసి తీసుకొచ్చిందే సీఏఏ-2019

వివాదం ఎందుకు?

జాబితాలో ముస్లింలను చేర్చకపోవడమే వివాదానికి ప్రధాన కారణం.


వివరాలు

స్థానిక(గ్రామ/మండల), తాలూకా, జిల్లా, రాష్ర్ట, జాతీయ స్థాయిల్లో ఎన్పీఆర్‌ను అప్‌డేట్‌ చేస్తారు. ఎన్పీఆర్‌లో వ్యక్తి పేరు, నివాస స్థితి, కుటుంబ యజమానితో గల బంధుత్వం, లింగం, పుట్టిన తేదీ, వైవాహిక స్థితి, విద్యార్హత, వృత్తి, తల్లిదండ్రులు లేదా భాగస్వాముల పేర్లు, జన్మస్థలం, ప్రస్తుత చిరునామా, ఎంతకాలంగా ప్రస్తుత చిరునామాలో ఉంటున్నారు, శాశ్వత చిరునామా వంటి అంశాలను పూరించాల్సి ఉంటుంది. అయితే, వీటికితోడు పౌరుల వ్యక్తిగత వివరాలు, పలు సున్నిత అంశాలు ప్రశ్నావళిలో జోడించడంతో వివాదం రాజుకున్నది. అయితే, ఎన్పీఆర్‌ కోసం పౌరులు ఇచ్చే సమాచారం స్వచ్ఛందమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. 


logo