శనివారం 06 జూన్ 2020
National - May 11, 2020 , 15:18:37

క్వారంటైన్‌ తప్పించుకోవాలని.. రైలు నుంచి దూకారు

క్వారంటైన్‌ తప్పించుకోవాలని.. రైలు నుంచి దూకారు

భువనేశ్వర్‌: క్వారంటైన్‌ నుంచి తప్పించుకొనేందుకు దాదాపు 20 మంది తాము ప్రయాణిస్తున్న రైలు నుంచి దూకి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్నారు. ఈ ఘటన ఒడిశాలోని ఆంగుల్‌ జిల్లా మఝికాలో ఆదివారం రాత్రి జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన శ్రామిక్‌స్పెషల్‌ రైళ్లలో గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌ నుంచి ఒడిశాకు చెందిన వలస కార్మికులు సొంతూళ్లకు బయల్దేరారు. మరికాసేపట్లో ఇంటికి చేరుతామనగా ఒడిశాలో కఠిన క్వారంటైన్‌ విషయం వారి చెవిన పడింది. దాంతో క్వారంటైన్‌ నుంచి తప్పించుకోవడానికి దాదాపు 20 మంది రైలు నుంచి దూకేశారు. 

వివిధ ప్రాంతాల నుంచి ఒడిశాకు వచ్చే వారు తప్పనిసరిగా 28 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని అక్కడి ప్రభుత్వం  మూడు రోజుల క్రితం కొత్త నిబంధనను అమలులోకి  తీసుకొచ్చింది. ఇది  తెలుసుకొన్న వలసకూలీలు 28 రోజుల క్వారంటైన్‌కు వెళ్లేందుకు ఇష్టపడక ఆంగుల్‌ జిల్లాని ఒక వంతెన వద్దకు రాగానే బయటకు దూకారు. ఈ విషయం గమనించిన బెనగాడియా గ్రామ సర్పంచ్‌ బిరాబరా నాయక్‌ వారిలో నుంచి ఏడుగురిని పట్టుకొని అధికారులకు అప్పగించారు. ఏడుగురిని జగత్‌సింగ్‌పూర్‌లో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌కు తరలించారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుంచి ఒడిశాకు వచ్చిన 391 మంది వలస కూలీల్లో 300 మందికి పాజిటివ్‌గా తేలడంతో క్వారంటైన్‌ నిబంధనలు కఠినతరం చేశారు.


logo