శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 16, 2020 , 13:56:18

ఒడిశాలో మ‌ల్క‌న్‌గిరి జిల్లా క‌లెక్ట‌ర్‌పై హ‌త్య‌కేసు!

ఒడిశాలో మ‌ల్క‌న్‌గిరి జిల్లా క‌లెక్ట‌ర్‌పై హ‌త్య‌కేసు!

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో మ‌ల్క‌న్‌గిరి జిల్లా కలెక్టర్‌పై హత్యాకేసు నమోదైంది. త‌న వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి (పీఏ) దేబ్ నారాయ‌ణ్‌ హత్య, సాక్ష్యాలను నాశనం చేసిన ఆరోప‌ణ‌ల‌పై మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ మ‌నీశ్ అగ‌ర్వాల్‌తోపాటు అత‌ని‌ సిబ్బందిపై కేసు నమోదు చేయాలని స్థానిక సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ పోలీసులను ఆదేశించారు. ఆ మేర‌కు కలెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌, మరో ముగ్గురు సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, మ‌నీశ్ అగ‌ర్వాల్ మాజీ పీఏ పండా కనిపించటం లేదంటూ గత ఏడాది ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆ త‌ర్వాత‌ ఆయన మృతదేహం గత డిసెంబర్‌ 28న మల్కన్‌గిరి పట్టణ సమీపంలోని ఓ రిజర్వాయర్‌లో లభించింది. పండా ఆత్మహత్య చేసుకున్నారని తొలుత భావించారు. ఐతే ఆరునెలల అనంతరం కలెక్టర్ మ‌నీశ్ అగ‌ర్వాల్‌‌, మరి కొందరు సిబ్బంది తన భర్తను హత్య చేశారని మృతుడు దేబ్ నారాయ‌ణ్‌ భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

అంతేగాక‌, త‌న‌కు న్యాయం చేయాలంటూ ఆమె రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్నికూడా ఆశ్రయించారు. ఈ నేప‌థ్యంలో కేసులో జోక్యం చేసుకోవాలంటూ మాన‌వ‌హ‌క్కుల సంఘం అక్క‌డి డీఐజీకి ఆదేశాలు జారీచేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తాజాగా స‌బ్ డివిజ‌నల్ మెజిస్ట్రేట్ ఆదేశాల‌తో నిందితుల‌పై హ‌త్య కేసులు న‌మోదు చేశారు. కాగా, త‌న‌పై హత్య కేసు నమోదు కావ‌డంపై కలెక్టర్‌ మనీశ్‌‌ అగర్వాల్ ఎలాంటి స్పంద‌న తెలియ‌జేయ‌లేదు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.