శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 03:05:10

భీమా-కోరెగావ్‌ కేసును కేంద్రానికి అప్పగించం

భీమా-కోరెగావ్‌ కేసును కేంద్రానికి అప్పగించం
  • ఎల్గార్‌ పరిషత్‌, భీమా-కోరెగావ్‌ వేర్వేరు అంశాలు
  • ఎన్పీఆర్‌ను రాష్ట్రంలో అమలు చేస్తాం
  • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబై, ఫిబ్రవరి 18: భీమా-కోరెగావ్‌ కేసును కేంద్రానికి అప్పగించబోమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. ఎల్గార్‌ పరిషత్‌ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు బృందానికి (ఎన్‌ఐఏ) అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలైన ఎన్సీపీ, కాంగ్రెస్‌ ఉద్ధవ్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి.


దీంతో మంగళవారం ఉద్ధవ్‌ ఠాక్రే ట్వీట్‌ చేస్తూ ‘2017లో పుణెలోని శనివార్‌వాడా వద్ద జరిగిన ఎల్గార్‌ పరిషత్‌ సదస్సు సందర్భంగా కొందరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు.. దీని ప్రభావంతో భీమా-కోరెగావ్‌ వద్ద హింస చెలరేగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీన్నిబట్టి ఎల్గార్‌ పరిషత్‌, భీమా-కోరెగావ్‌ అనేవి రెండు వేర్వేరు అంశాలు. భీమా-కోరెగావ్‌ కేసును కేంద్రానికి అప్పగిస్తే దళిత సోదరులకు న్యాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ కేసును కేంద్రానికి అప్పగించను’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఎన్పీఆర్‌ను మహారాష్ట్రలో అమలు చేస్తామని, దీని వల్ల నష్టమేమీ లేదని ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. 


logo