గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 15:28:13

ఇకపై ఉత్పత్తులపై దేశం పేరు రాయాల్సిందే..!

ఇకపై ఉత్పత్తులపై దేశం పేరు రాయాల్సిందే..!

న్యూఢిల్లీ : చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారంలో వాణిజ్య సంస్థ క్యాట్ మరో విజయాన్ని సాధించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఈ-కామర్స్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులపై దేశం పేరు రాయాలి. 

డిస్కౌంట్ పేరిట కంపెనీలు ఇకపై వినియోగదారులను మోసం చేయలేవని చెప్పవచ్చు. ఈ-కామర్స్ కంపెనీలు రాబడి, వాపసు, మార్పిడి, వారెంటీలు, హామీలు, డెలివరీ, సరుకుల సమాచారాన్ని తప్పనిసరిగా వినియోగదారులకు అందించాలి. ఈ నిబంధనలు ఖచ్చితంగా చైనా ఉత్పత్తుల బహిష్కరణ ప్రచారాన్ని పూర్తి విజయవంతం చేస్తాయని పలువురు నమ్ముతున్నారు. ఈ సంవత్సరం పండుగలలో కూడా చైనా ఉత్పత్తులు అమ్మే సూచనలు కనిపించడంలేదు. భారతీయ ఉత్పత్తులు మాత్రమే మార్కెట్లో లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు. 

కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా వస్తువులకు మినహాయింపు ఇస్తున్నపక్షంలో.. కంపెనీలు దాని అసలు ధర ఎంత? వినియోగదారునికి ఎంత తగ్గింపు ఇస్తున్నారో చెప్పాలి. ఆ ఉత్పత్తి గడువు తేదీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై వినియోగదారుల రక్షణ చట్టం కింద శిక్షాత్మక చర్యలు కూడా తీసుకుంటారు. అందుకని కంపెనీలు ఈ నిబంధనలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది.

ఇది శుభ పరిణామం : క్యాట్

చైనా ఉత్పత్తులను బహిష్కరించాల్సిన అవసరం ఉందని క్యాట్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ విక్రమ్ సింగ్ దేవ్ అన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోందని చెప్పారు. 

తమ సంస్థ తరఫున చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నదని, ఈ-కామర్స్ కంపెనీలు ఉత్పత్తి వివరాలతోపాటు దేశం పేరు రాయడం కూడా తప్పనిసరి చేయడం మంచి పరిణామమని క్యాట్ జాతీయ ఉపాధ్యక్షుడు అమర్ పర్వానీ తెలిపారు. ఈ డిమాండ్‌ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్‌కు సంబంధించిన వినియోగదారు నిబంధనలను మార్చుతూ చర్యలు చేపట్టడం శుభపరిణామమని అన్నారు.


logo