ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 14:35:13

ఏ శక్తీ మన భూమిని అంగుళం కూడా తీసుకోలేదు

ఏ శక్తీ మన భూమిని అంగుళం కూడా తీసుకోలేదు

లఢక్: ప్రపంచంలోని ఏ శక్తి కూడా మన భూమిని అంగుళమైనా తీసుకోలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనేతో కలిసి సరిహద్దులోని లఢక్, లు‌కుంగ్ సైనిక స్థావరాలను శుక్రవారం ఆయన సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న ఆర్మీ, ఐటీబీపీ సైనికులతో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. గల్వాన్ లోయ వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో పాల్గొన్న సైనికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం సైనికులనుద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. పెట్రోల్ పాయింట్ 14 వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఏం జరిగిందో అందరికీ తెలుసునని, దేశ సరిహద్దును కాపాడే క్రమంలో కొందరు సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన అన్నారు. వారి లేని లోటు పట్ల బాధగా ఉన్నదని, అయితే మిమల్ని ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉన్నదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో అమరులైన భారత సైనికులకు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు.

సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్, చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అయితే దీని వల్ల సమస్య ఎంత వరకు పరిష్కారమవుతుందన్నది తాను చెప్పలేనన్నారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాలను ఆయన సందర్శించడంతో పాటు అక్కడి పరిస్థితులపై సైనిక అధికారులతో సమీక్షిస్తారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.


logo