గురువారం 22 అక్టోబర్ 2020
National - Sep 04, 2020 , 16:27:58

స‌జ్జ‌న్‌కుమార్‌కు బెయిల్ నిరాక‌రించిన సుప్రీంకోర్టు

స‌జ్జ‌న్‌కుమార్‌కు బెయిల్ నిరాక‌రించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: 1984 నాటి సిక్కు వ్య‌తిరేక‌ అల్ల‌ర్ల కేసులో దోషిగా తేలి జీవిత‌ఖైదు అనుభ‌విస్తున్న‌ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 'ఇదేమీ చిన్న కేసు కాదు, ఈ కేసులో మేం బెయిల్ మంజూరు చేయలేం' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. అనారోగ్య కారణాలరీత్యా త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ స‌జ్జ‌న్‌కుమార్ ఇటీవ‌ల‌ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. 

ఈ నేప‌థ్యంలో స‌జ్జ‌న్‌కుమార్ బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా స‌జ్జ‌న్‌కుమార్‌ ఆస్పత్రిలో ఉండటానికి కూడా వీల్లేదని పేర్కొన్న‌ది. ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయని అందువ‌ల్ల ఆయ‌న ఆస్ప‌త్రిలో చేర‌డానికి కూడా వీల్లేద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తేల్చిచెప్పింది. న్యాయస్థానాలు భౌతికంగా పని చేయడం ప్రారంభమైన తర్వాత శిక్ష, జీవితఖైదుపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. 

1984లో అప్ప‌టి ప్రధాని ఇందిరాగాంధీ హ‌త్య అనంత‌రం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. హ‌త్య‌కు పాల్ప‌డిన బాడీగార్డులు ఇద్ద‌రూ సిక్కులు కావ‌డంతో ఆ స‌మాజంపై కొంద‌రు హింస‌కు దిగారు. ఢిల్లీ రాజ్‌న‌గ‌ర్‌లోని ఓ కుటుంబంలో ఐదుగురు సభ్యులను హత్యచేశారు. గురుద్వారాకు నిప్పంటించారు. ఈ సమయంలో సజ్జన్‌కుమార్‌ ఆ ప్రాంత ఎంపీగా కొనసాగుతున్నారు. ఆ అల్లర్లకు సంబంధించిన కేసులో సజ్జన్ దోషిగా తేలడంతో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo