ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 17:18:28

త‌మిళ‌నాడును తాకిన ఈశాన్య రుతుప‌వ‌నాలు

త‌మిళ‌నాడును తాకిన ఈశాన్య రుతుప‌వ‌నాలు

చెన్నై : నైరుతి రుతుప‌వ‌నాలు బ‌ల‌హీన‌ప‌డిన మ‌రు క్ష‌ణ‌మే ఈశాన్య రుతుప‌వ‌నాలు త‌మిళ‌నాడు రాష్ర్టాన్ని తాకాయి. త‌మిళ‌నాడు, కేర‌ళ‌తో పాటు ద‌క్షిణ ద్వీప‌క‌ల్ప ప్రాంతానికి ఈశాన్య రుతుప‌వ‌నాలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతానికి ఈశాన్య రుతుప‌వ‌నాలు బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ త్వ‌ర‌లోనే బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈ రుతుప‌వనాల రాక నేప‌థ్యంలో నేటి నుంచి డిసెంబ‌ర్ చివ‌రి నాటికి 44 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది.  

ఈ సంద‌ర్భంగా చెన్నై వాతావ‌ర‌ణ శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ బాల‌చంద్ర‌న్ మాట్లాడుతూ.. ద‌క్షిణ త‌మిళ‌నాడుతో పాటు తీర ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు ప‌డ్డాయి. మ‌ధురై జిల్లాలోని మేలూరులో 6 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు తెలిపారు. గ‌త 24 గంట‌ల్లో ఇదే అత్య‌ధిక వ‌ర్ష‌పాతం అని ఆయ‌న చెప్పారు. చెన్నై జిల్లాలోని నుంగంబ‌క్కం, సోలింగ‌న‌ల్లూరులో 1 సెంటిమీట‌ర్ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని బాల‌చంద్ర‌న్ పేర్కొన్నారు.