ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 15:47:29

కశ్మీర్‌లో హై అలర్ట్‌

కశ్మీర్‌లో హై అలర్ట్‌

జమ్మూ : పుల్వామా తరహాలో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల హెచ్చరికలతో ఉత్తర, సెంట్రల్‌ కశ్మీర్‌లో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. శ్రీనగర్ - బారాముల్లా రహదారిలో లష్కరే తోయిబా (ఎల్ఈటీ) భారీ ఎత్తున దాడికి ప్లాన్ చేస్తున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ దాడి కారు బాంబుతో కూడా జరుగవచ్చనీ, బారాముల్లాలోని పటాన్‌ ప్రాంతం నుంచి హెచ్ఎంటీ (శ్రీనగర్ శివార్లలో) వెళ్లే మార్గంలోనే ఈ దాడి జరుగుతుందని అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో రెక్కీ జరిగిందని, ప్లాన్‌ ఇప్పటికే రెహమాన్ భాయ్ అనే విదేశీ ఉగ్రవాది చేతుల్లో ఉందని, దాడికి అంబులెన్స్‌ను కూడా ఉపయోగించవచ్చని తెలిసిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ మేరకు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు హై అలర్ట్‌ ప్రకటించి, ఉత్తర కశ్మీర్ వ్యాప్తంగా పటాన్, సోపోర్, హంద్వారా ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపడుతున్నారు. భారీగా నష్టం కలిగించేందుకు ఉగ్రవాదులు ఐఈడీ (డిటెక్షన్ ఇంప్రోవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్)లను ఉపయోగించవచ్చని సమాచారం వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. ఆర్మీ రోడ్డు ఓపెనింగ్ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని, హైవేపై ఏదైనా కాన్వాయ్‌ మూవ్‌మెంట్ ప్రారంభించడానికి ముందు క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశాలున్నాయన్నారు. ఇదిలా ఉండగా.. డెలినా బారాముల్లాలోని డీపీఎస్ కాలనీ నుంచి ఒక ఆల్టో కారును దొంగిలించినట్లు సమాచారం. ఇటీవల భారీ నష్టం వాటిల్లడంతో ఉగ్రవాదులు విసుగు చెంది ఉన్నారని ఓ అధికారి తెలిపారు. 2020 జనవరి నుంచి కశ్మీర్‌లో టాప్ కమాండర్లతో పాటు 124 మంది, ఉత్తర కశ్మీర్‌లో 50 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo