సోమవారం 13 జూలై 2020
National - Jun 20, 2020 , 01:50:51

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ

  • ఎవ్వరూ చొరబడలేదు మన భూభాగం
  • సైనిక పోస్టులు సురక్షితం
  • చైనాకు మన సైనికులు గుణపాఠం నేర్పారు
  • చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని నేతల సూచన

న్యూఢిల్లీ, జూన్‌ 19: భారత భూభాగంలోకి ఎవ్వరూ చొరబడలేదని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో మన సైనిక పోస్టులను పొరుగుదేశ సైన్యం (చైనా) ఆక్రమించుకోలేదని స్పష్టంచేశారు. భరతమాత వైపు ఎవరు కన్నెత్తి చూడకుండా మన వీర సైనికులు గట్టి బుద్ధి చెప్పారని కొనియాడారు. భారతదేశం బయటిశక్తులకు తలొగ్గదన్నారు. గల్వాన్‌ ఘర్షణ నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితులపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మాట్లాడారు. సరిహద్దుల్లో నిత్యం ఏదో ఒక సమస్య సృష్టిస్తూ కయా ్యనికి కాలుదువ్వుతున్న చైనాకు గట్టిగా బుద్ధిచెప్పే వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని సమావేశంలో నేతలు సూచించారు.

ఒక్క ఇంచు భూమి కూడా లాక్కోలేరు

దేశరక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా మన సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని మోదీ అన్నారు. ‘మన భూభాగంలో ఒక్క ఇంచు కూడా ఎవరూ ఆక్రమించుకోకుండా కాపాడుకొనే శక్తి మనకుంది. త్రివిధ దళాలకు స్వేచ్ఛనిచ్చాం. దౌత్యపరంగా కూడా మన విధానాన్ని చైనాకు స్పష్టంగా చెప్పాం. భారత్‌ శాంతి, స్నేహాలనే కోరుకుంటుంది. కానీ సార్వభౌమత్వ రక్షణ అత్యున్నమైనది’ అని పేర్కొన్నారు. సరిహద్దు వెంట మౌలికవసతుల ఏర్పాటునచ్చని పొరుగుదేశం దుశ్చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అమరులకు నేతలు శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రశ్నలు గుప్పించిన సోనియాగాంధీ 

సరిహద్దుల్లో ఘర్షణలపై ప్రభుత్వం పూర్తి సమాచారం వెల్లడించటంలేదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. గల్వాన్‌ ఘర్షణలో నిఘావైఫల్యం ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘దేశంమొత్తం ఒక్కతాటిపైకి వచ్చి కొండశిఖరంలా స్థిరంగా నిలబడుతుంది. దేశ సమగ్రత రక్షణకోసం ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా ఉంటాం. కానీ ఈ సంక్షోభం గురించి చాలా విషయాల్లో ఇప్పటికీ గందరగోళంగానే ఉన్నది. సమాచారం విషయంలో ఇంకా చీకట్లోనే ఉన్నాం’ అని సోనియా అన్నారు. సరిహద్దుల్లో చైనా భారీ నిర్మాణాలు చేపడుతుంటే శాటిలైట్‌ చిత్రాల ద్వారా గుర్తించలేకపోయారా? మిలిటరీ ఇంటెలిజెన్స్‌ ఏమైందని సోనియా ప్రశ్నించారు. చైనా వాస్తవాధీన రేఖ ఆవలికి వెళ్లిపోయేలా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని సూచించారు. 

సైన్యం వెనుక మేమున్నాం

బీజేపీతో తీవ్ర విబేధాలు ఉన్నప్పటికీ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్‌థాకరే తదితరులు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ‘ఈ సమయంలో ప్రతికూల సందేశం వెళ్లేలా ఏమీ మాట్లాడదల్చుకోలేదు. చైనా ముందు తలవంచే ప్రసక్తే లేదు. చైనాపై భారత్‌దే పైచేయి అవుతుంది. మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో మనమంతా ఒక్కటిగా ఉండాలి’ అని మమతాబెనర్జీ అన్నారు. వ్యూహాత్మకంగా కీలకరంగాల్లో చైనా పెట్టుబడులను నిషేధించాలని సూచించారు. ‘మనమంతా ఒక్కటే. ప్రధానమంత్రి జీ మేమంతా మీవెంటే ఉన్నాం. భారత్‌ శక్తిమంతమైనది’ అని ఉద్ధవ్‌థాకరే పేర్కొన్నారు. నిఘావైఫల్యాలపై గతంలో వాజపేయి హయాంలో నియమించినట్టుగా విచారణ కమిటీని నియమిస్తారా అని సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. చైనా బలగాలు వెనక్కు వెళ్లాల్సిందేనని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ స్పష్టంచేశారు. సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులు పాల్గొన్నారు. 

మమ్మల్ని ఎందుకు పిలువలేదు?

అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం అందని ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై తీవ్రంగామండిపడ్డాయి. ఆర్జేడీ ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసి, పంజాబ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మా పార్టీ అభిప్రాయం తెలుసుకోవాలని బీజేపీకి అనిపించలేదా అని ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌ ప్రశ్నించారు. తమ అభిప్రాయం అడుగకపోవటం నిరాశ కలిగించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఈ సమావేశానికి ఆహ్వానం అందని జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు.


logo