సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 17:23:41

ఔరా! జుగాడ్ పనిముట్లు.. ఎంత ముద్దొస్తున్నాయో..!

ఔరా! జుగాడ్ పనిముట్లు.. ఎంత ముద్దొస్తున్నాయో..!

హైదరాబాద్ : అవసరం అన్నీ నేర్పిస్తుంది. ఇది నిజంగా నిజం. ఒక్కోసారి కొత్త ఆవిష్కరణలు కూడా రూపుదిద్దుకుంటాయి. ఇంట్లో దొరికే చిన్నచిన్న వస్తువులతో పనిముట్లు తయారు చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా వ్యవసాయంలో జుగాడ్ ఆవిష్కరణలు కోకొల్లలు. కొన్ని మన అవసరాల కోసం తయారుచేసుకొంటుండగా.. మరికొన్ని మన ఆలోచనల నుంచి పుట్టుకొస్తుంటాయి. కొన్నింటిని చూడగానే.. అరె భలే గమ్మత్తుగా ఉందే.. అని నవ్వుకొంటాం. మరికొన్నింటిని చూడగానే హ్యాట్సాఫ్ రా బాబు.. అని అప్రయత్నంగానే చేతు పైకెత్తి సెల్యూట్ కొడతాం. 

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని హన్మాజీపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి మర్రిపల్లి అభిషేక్.. తన తల్లి రాజవ్వ కూలీపనికెళ్లి నిత్యం వడ్లను ఒకచోట చేర్చేందుకు పడుతున్న కష్టాన్ని కండ్లారా చూసి ఆమెకు చోదోడుగా నిలిచేందుకు వడ్లను తక్కువ వ్యవధిలో ఎక్కువ సంచులను నింపేలా పాడీ ఫిల్లింగ్ డివైస్ తయారుచేశాడు. కేవలం రూ.7 వేల ఖర్చుతో ఈ యంత్రాన్ని తయారుచేసి జాతీయ స్థాయిలో ఔరా అనిపించుకొన్నాడు. 


ఇదే కోవలో.. అతి తక్కువ ఖర్చుతో సరికొత్త సాధనాలను రూపొందిస్తూ, సామాన్యుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు అస్సాం వాసి ఉద్ధభ్ భరలి. ఆయన ఇప్పటివరకు 140కి పైగా ఆవిష్కరణలు చేశారు. కుటుంబాన్ని అప్పుల బారి నుంచి కాపాడేందుకు 30 ఏండ్ల కిందట సరికొత్త వస్తువులను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. వీటిలో ఆర్టిఫిషియల్ లింబ్స్ మొదలుకొని కొబ్బరి తీసే వంటింటి సాధనం వరకు ఉన్నాయి.

పరిమిత వనరులను వినూత్న మార్గంలో ఉపయోగించే సమస్య పరిష్కారానికి అనువైన విధానంలో నిత్యం ఎన్నో కొత్త , వినూత్న వస్తువులు మన ముందుకొస్తున్నాయి. జుగాడ్ వస్తువులను తయారు చేయడంలో భారతీయులను మించిన వారు లేరనే ప్రశంస కూడా ఉన్నది. మనకు అందుబాటులో దొరికే వస్తువులతో అద్భుత ఆవిష్కరణలు చేసేవారిని ప్రోత్సాహించడం ద్వారా మరిన్ని ఆవిష్కరణలు వచ్చేందుకు సహకరించినవారమవుతాం. ఈ విషయంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎండీ ఆనంద్ మహీంద్ర ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. తన కంటికి కనిపించే కొత్త కొత్త వస్తువులను, వినూత్న ఆవిష్కరణలను ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ.. పలువురికి నగదు పురస్కారాలు అందజేసి ప్రోత్సహిస్తున్నారు.

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన స్కూళ్లు.. ఇప్పుడు ఆన్ లైన్ టీచింగ్ విద్యావిధానానికి శ్రీకారం చుట్టారు. అయితే పట్టణాల్లో ఉండేవారికి సరేసరి.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ లేక అనేక అవస్థలు పడుతుండగా.. టీచర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓ టీచరమ్మ తన బుర్రకు పనిచెప్పి విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు బోధించేందుకు కుర్చీ, హ్యాంగర్, రెండు తాళ్లతో.. వీడియో పాఠాల జుగాడ్ రూపొందించారు.

భౌతిక దూరం పాటించాలంటూ వైద్యులు పదే పదే చెప్తుండటాన్ని గమనించిన ఓ పాల వ్యాపారి.. భౌతిక దూరం పాటించేలా తన వాహనానికి గరాటు, మీటర్ పైపుతో ఏర్పాట్లు చేసి ఔరా అనేట్లుగా చేశారు.

ఇటీవలనే ఓ యువకుడు క్యాబ్ వ్యాపారం సాగడం లేదని.. తన కారును కాస్తా చెరుకు బండిగా మార్చి ఆకట్టుకొంటూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఓ ఆటోవాల భౌతిక దూరం పాటించడం కోసం తన ఆటోను వినూత్నంగా సిద్ధం చేసి ఆకర్శిస్తున్నాడు. ఈ ఆటోవాలను తన ఆర్ అండ్ సలహాదారుగా నియమించుకునేందుకు సిద్ధం అంటూ ఆ ఆటోవాలా వీడియోను ట్విట్టర్లో ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.

'జుగాడ్‌'పై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని జడ్జ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన జైదీప్ ప్రభు ఒక పుస్తకం రాశారు. వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణల దిశగా ఔత్సాహికులను జుగాడ్‌ విధానం ప్రోత్సహిస్తుందని, వ్యక్తి ఆలోచనే ఇందులో ప్రధాన పెట్టుబడి అని ఆయన తెలిపారు. మనం, మన చుట్టూ ఉన్న సమాజం ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి వాటికి పరిష్కారాలు కనుగొనడమే ఈ విధానంలో ప్రధానాంశం అని తన పుస్తకంలో పేర్కొన్నారు.


logo