శుక్రవారం 29 మే 2020
National - Mar 31, 2020 , 02:09:17

లాక్‌డౌన్‌ను పొడిగించం!

లాక్‌డౌన్‌ను పొడిగించం!

  • ప్రస్తుతం ఆ ఆలోచన లేదు
  • పొడిగిస్తామన్నవి వదంతులే
  • దేశంలో కరోనా వైరస్‌ ఇంకా స్థానిక వ్యాప్తి దశలోనే..
  • స్పష్టంచేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టచేసింది. లాక్‌డౌన్‌ను పొడిగించనున్నట్లు పలు మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల్లో వెలువడిన వార్తలు అవాస్తవమని కొట్టివేసింది. కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబా ఈ మేరకు సోమవారం స్పష్టంచేశారు. మరోవైపు, లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులు, వలస కార్మికుల సంచారంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. 

100 నుంచి 1000 కేసులకు చేరడానికి 12 రోజులు..

దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా ‘స్థానిక వ్యాప్తి’ దశలోనే ఉన్నదని, ‘సమూహ వ్యాప్తి’ దశకు చేరుకోలేదని కేంద్రం స్పష్టంచేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా కేసులు 100 నుంచి 1000కి చేరడానికి 12 రోజులు పట్టిందని, అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే భారత్‌లో కరోనా వృద్ధి రేటు తక్కువగా ఉన్నదని చెప్పారు.   ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)కు చెందిన అధికారి గంగా ఖేడ్కర్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 38,442 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గత మూడు రోజుల్లో  ప్రైవేట్‌ ల్యాబొరేటరీల్లో 1,331 పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఐసీఎంఆర్‌ సిఫార్సు చేసిన ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌' తీసుకున్న అనంతరం డాక్టర్లు గుండెపోటుతో మృత్యువాతపడినట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ఇందుకు సంబంధించి తమ వద్ద పూర్తి వివరాలు లేవన్నారు. అయితే వారికి ముందే గుండె సంబంధిత సమస్యలు ఉంటే తప్ప ఇలా జరుగదని అభిప్రాయపడ్డారు. బరేలీలో వలస కార్మికులపై స్ప్రే చేసిన ఘటనపై మాట్లాడుతూ.. అది కొందరు సిబ్బంది అత్యుత్సాహంతో చేసిన చర్య అని, వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు బదులిచ్చారు. కాగా, ఆటోమొబైల్‌ సంస్థలు వెంటిలెటర్లను తయారుచేయాల్సిందిగా కేంద్రం విజ్ఞప్తిచేసింది. కరోనా సన్నద్ధతపై స్పందన తెలియజేయాలని ఐఏఎస్‌ అధికారులను కోరింది.


logo