గురువారం 02 జూలై 2020
National - Jun 28, 2020 , 20:29:00

చట్టాన్ని అతిక్రమించలేదు: ఉద్యమకారిణి రెహనా ఫాతిమా భర్త

చట్టాన్ని అతిక్రమించలేదు: ఉద్యమకారిణి రెహనా ఫాతిమా భర్త

కొచ్చి: తన భార్య చట్టాన్ని ఉల్లంఘించలేదని, కేరళ హైకోర్టులో ఆమెకు బెయిల్‌ లభిస్తుందనే నమ్మకం తనకుందని మహిళా హక్కుల ఉద్యమకారిణి రెహనా ఫాతిమా భర్త మనోజ్‌ కే శ్రీధర్‌ పేర్కొన్నారు. తన మైనర్ పిల్లలు తన అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఫాతిమా శుక్రవారం కేరళ హైకోర్టును ఆశ్రయించింది.  ఇది అభ్యంతకరంగా ఉందంటూ అడ్వొకేట్‌ ఏవీ అరుణ్‌ప్రకాశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫాతిమాపై థిరువల్ల పోలీసులు జువైనల్‌ జస్టిస్‌, ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.  

ఈ సందర్భంగా ఫాతిమా భర్త మనోజ్‌ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘సోమవారం కేరళ హైకోర్టు ఫాతిమాకు బెయిల్‌ మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాం. మేం చట్టాన్ని అతిక్రమించలేదు. చట్టపరిధిలోని ప్రజల్లో అవేర్‌నెస్‌ తెచ్చేందుకు ప్రయత్నించాం. పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు వచ్చినప్పుడు రెహనా ఇంట్లో లేదు. రేపు ఆమె విచారణ అధికారి ఎదుట హాజరవుతుంది. ఒకవేళ బెయిల్‌ రాకుంటే మేం పోలీసులకు సహకరిస్తాం.’ అని వ్యాఖ్యానించాడు. ఫాతిమా చేసిన పనిలో అశ్లీలత లేదని, ఇది ఒక తల్లి, ఆమె పిల్లల మధ్య పరస్పర చర్య అని,  అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెను కూల్‌ చేసేందుకు పిల్లలు తల్లి శరీరంపై ఫీనిక్స్ పక్షిని చిత్రీకరించారని మనోజ్‌ పేర్కొన్నాడు.  ఇది మంచి కళ అని, పిల్లల కళను, ఇది సమాజంలో సమస్య కానవసరం లేదని చూపించేందుకే ఫాతిమా ఆ వీడియో పోస్ట్ చేసిందని అతడు వివరించాడు.  ఓ రాజకీయ పార్టీ కావాలనే తమపై కక్షగట్టి ఫిర్యాదులు చేస్తున్నదని, రాజకీయ ప్రయోజనం కోసం వారు ఇలా చేస్తున్నారని మనోజ్‌ ఆరోపించాడు. కాగా, మహిళా హక్కుల ఉద్యమకారిణి రెహనా ఫాతిమా గతంలో శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి దేశవ్యాప్తంగా ఫేమస్‌ అయ్యింది.  


logo