మంగళవారం 07 జూలై 2020
National - Jun 21, 2020 , 14:10:43

ఈ ఏడాది కన్వర్ యాత్ర రద్దు

ఈ ఏడాది కన్వర్ యాత్ర రద్దు

లక్నో: ఈ ఏడాది కన్వర్ యాత్ర రద్దయ్యింది. జూలై 6 నుంచి నిర్వహించ తలపెట్టిన ఈ యాత్రను కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం హర్యానా సీఎం ఎంఎల్ ఖత్తర్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా నేపథ్యంలో కన్వర్ యాత్రను ఈ ఏడాది రద్దు చేయడంపై వారితో చర్చించారు. అలాగే హిందూమత గురువులు, కన్వర్ సంఘంతోనూ ఈ విషయంపై ఆయన మాట్లాడారు. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల సీఎంలతోనూ దీని గురించి చర్చించనున్నారు.
ప్రతి ఏటా శ్రావణ మాసంలో లక్షలాది మంది శివ భక్తులు పవిత్ర కన్వర్ యాత్రను నిర్వహిస్తారు. హరిద్వారా, గోముఖ్, గంగోత్రి, సుల్తాన్ గంజ్ లోని పవిత్ర గంగా నదుల వరకు కాలిన నడకన యాత్రగా వెళ్లి గంగా జలాన్ని సేకరిస్తారు. ప్రముఖ శైవ ఆలయాలతోపాటు తమ ఊర్ల లోని శివాలయాల్లో ఈ గంగా జలంతో అభిషేకం చేస్తారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి లక్షలాదిగా శివ భక్తులు కాలినడకన ఈ పవిత్ర కన్వర్ యాత్రలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత కోసం ఢిల్లీ-హర్యానా మధ్య ఉన్న జాతీయ రహదారి 58పై ట్రాఫిక్ ను తాత్కలికంగా మళ్లిస్తారు.logo