ఆదివారం 24 జనవరి 2021
National - Dec 23, 2020 , 15:00:06

ఇష్టంతో చేసుకున్న పెండ్లి, మత మార్పిడిలో జోక్యం వద్దు

ఇష్టంతో చేసుకున్న పెండ్లి, మత మార్పిడిలో జోక్యం వద్దు

కోల్‌కతా: మేజర్‌ అయిన మహిళ ఇష్టప్రకారం చేసుకున్న పెండ్లి, మత మార్పిడిలో ఇతరుల జోక్యం వద్దని కోల్‌కతా హైకోర్టు సూచించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 19 ఏండ్ల యువతి ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతోపాటు మతం కూడా మారింది. దీనిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను భయపెట్టి పెండ్లి చేశారని, బలవంతం చేసి మతం మార్చారని ఆరోపించారు. కోల్‌కతా హైకోర్టు ఈ కేసుపై విచారణ జరిపింది. ఆ యువతిని కోర్టుకు పిలిచి ఆమె వాదన విన్నది. తన ఇష్టపూర్వకంగానే నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకున్నట్లు ఆమె చెప్పింది. 

అయితే తన కుమార్తెను భయపెట్టి ఆమెతో ఇలా చెప్పిస్తున్నారని ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆయన అనుమానం నివృత్తి చేసే బాధ్యతను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైబల్ బాపులికి ధర్మాసనం అప్పగించింది. తండ్రి, ఆయన కుమార్తె మాత్రమే ఆయన చాంబర్‌లో బుధవారం ఈ విషయంపై మాట్లాడుకోవాలని పేర్కొంది. గురువారం కేసు విచారణ సందర్భంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైబల్ బాపులి తన నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo