సోమవారం 18 జనవరి 2021
National - Dec 19, 2020 , 19:55:45

మత మార్పిడి వ్యతిరేక చట్టం కింద అరెస్టైన ఇద్దరు విడుదల

మత మార్పిడి వ్యతిరేక చట్టం కింద అరెస్టైన ఇద్దరు విడుదల

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మత మార్పిడి వ్యతిరేక చట్టం కింద అరెస్టైన ఇద్దరు ముస్లిం యువకులు కోర్టు ఆదేశంతో విడుదలయ్యారు. మొరాదాబాద్‌లోని కాంత్ ప్రాంతానికి చెందిన ముస్లిం యువకుడు, 22 ఏండ్ల హిందూ యువతి జూలై 24న పెండ్లి చేసుకున్నారు. ఐదు నెలల తర్వాత కొత్త చట్టం అమలులోకి రావడంతో తమ వివాహాన్ని నమోదు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లారు. కాగా బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఆ జంటను అడ్డుకున్నారు. లవ్‌ జిహాద్‌ కోసం హిందూ యువతిని ముస్లిం యువకుడు బలవంతంగా పెండ్లి చేసుకున్నట్లు ఆరోపించి వారితో ఘర్షణకు దిగారు. తన ఇష్ట ప్రకారమే పెండ్లి చేసుకున్నట్లు ఆ యువతి చెప్పగా ఆమెపై మండిపడ్డారు. మరోవైపు ముస్లిం యువకుడితోపాటు అతడి సోదరుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. గర్భవతి అయిన ఆ మహిళను ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. కాగా ఆమెకు అబార్షన్‌ అయ్యేందుకు ఇంజక్షన్‌ ఇచ్చారన్న వదంతులను ప్రభుత్వం ఖండించింది. 

మరోవైపు బలవంతపు మత మార్పిడిపై పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. ఈ నేపథ్యంలో సుమారు రెండు వారాలుగా మొరాదాబాద్‌ జిల్లా జైలులో ఉన్న ఇద్దరు ముస్లిం యువకులను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో  శనివారం వారిద్దరిని జైలు నుంచి విడుదల చేశారు. కాగా పరస్పర అంగీకారంతోనే తాము వివాహం చేసుకున్నామని ముస్లిం యువకుడు తెలిపాడు. కొత్త చట్టం కారణంగా తాను 15 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందని చెప్పాడు. కోర్టు ఆదేశంతో జైలు నుంచి విడుదల కావడం సంతోషంగా ఉందన్నాడు. అనంతరం అతడి కుటుంబ సభ్యులు కన్నీటితో ఆ యువకుడ్ని దగ్గరకు తీసుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి