సోమవారం 30 మార్చి 2020
National - Mar 12, 2020 , 18:54:44

ఎన్‌పీఆర్‌కు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు : అమిత్‌షా

ఎన్‌పీఆర్‌కు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు : అమిత్‌షా

ఢిల్లీ : జాతీయ పౌర పట్టిక(ఎన్‌పీఆర్‌)కు ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, అదేవిధంగా ఎవరిని అనుమానాస్పద వ్యక్తులుగా ప్రకటించమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఢిల్లీ అల్లర్లపై రాజ్యసభలో అమిత్‌షా గురువారం వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ఎన్‌పీఆర్‌కు ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. తమ వద్ద ఉన్న సమాచారం మాత్రమే ఇస్తే సరిపోతుందని మిగతావాటిని ఖాళీలుగా వదిలేస్తారని తెలిపారు. సీఏఏతో ముస్లింలకు ఎట్టి పరిస్థితుల్లో పౌరసత్వం పోదన్నారు. కావాలనే సీఏఏపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అల్లర్లకు బాధ్యులైన ఎవరినీ వదిలిపెట్టమని తెలిపారు. నిందితులు ఎంతటివారైనా శిక్ష పడుతుందన్నారు. ఢిల్లీ అల్లర్లపై 700 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. 

ఢిల్లీ అల్లర్లలో ఐసిస్‌ పాత్ర ఉందని తెలిపిన అమిత్‌షా ఐసిస్‌ అనుమానితుడిని అరెస్టు చేసినట్లుగా చెప్పారు. విచారణకు మరో సిట్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అల్లర్ల ప్రారంభానికి రెండు రోజుల ముందు కొన్ని సోషల్‌ మీడియా అకౌంట్లు ప్రారంభమయ్యాయి. అవి 25వ తేదీ అనంతరం నిర్వీర్యం అయ్యాయి. ఈ సోషల్‌ మీడియా అకౌంట్లు అల్లర్ల వ్యాప్తి కోసమే పనిచేశాయి. వాటి యజమానులు తాము సురక్షితంగా ఉన్నామనుకుంటున్నారు. కానీ ఇది డిజిటర్‌ యుగం. వారిని కనిపెట్టి చట్టం ముందు హాజరుపరుస్తామన్నారు.


logo