ఎల్ఏసీ ఘర్షణాత్మక ప్రాంతాల్లో సైన్యం మోహరింపు : ఆర్మీ చీఫ్

న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె ఇవాళ మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. సరిహద్దుల్లో పరిస్థితితో పాటు కోవిడ్19 లాంటి సమస్యలు కీలకంగా మారాయన్నారు. ఉత్తరం దిశగా ఉన్న సరిహద్దుల్లో నిత్యం అప్రమత్తంగా ఉన్నామన్నారు. శాంతియుత పరిష్కారం కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. అయినా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని ఆర్మీ చీఫ్ తెలిపారు. టెక్నాలజీ సహిత సైన్యాన్ని తయారు చేసేందుకు, భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త కార్యాచరణ రూపొందించినట్లు నరవాణె చెప్పారు. పాకిస్థాన్ ఇంకా ఉగ్రవాదంపైనే ఆధారపడి ఉంటోందన్నారు. ఉగ్రవాదాన్ని తాము ఏమాత్రం సహించబోము అని, సరైన సమయంలోనే సరైన రీతిలో ప్రతిదాడి చేస్తామన్నారు. ఇదే సందేశాన్ని తాము ఇచ్చినట్లు చెప్పారు. చైనా, పాక్ దేశాలు ఓ సమస్యగా మారాయని, ఆ వాస్తవాన్ని కొట్టిపారేయలేమన్నారు.
నిత్యం నిఘా..
ప్రతి ఏడాది సాంప్రదాయ శిక్షణా ప్రాంతాలకు పీఎల్ఏ దళాలు వస్తుంటాయని, శిక్షణ కాలం ముగిసిన తర్వాత శీతాకాలంలో ఆ ప్రాంతాలను ఖాళీ చేస్తారని, టిబెట్ పీఠభూమిలో ఉన్న పీఎల్ఏ దళాలు వెనక్కి వెళ్లడం మంచి పరిణామమే అన్నారు. కానీ ఘర్షణాత్మక ప్రాంతాల్లో.. చైనా వైపు కానీ, మన వైపు కానీ దళాల సంఖ్య తగ్గలేదన్నారు. భారత్, చైనా మధ్య చర్చలు సమగౌరవంతో సాగాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సరిహద్దు సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. హై ఆల్టిట్యూడ్‌లో ఎక్కువ సంఖ్యలో దళాలు ఉన్నా.. చలికాలంలో జరిగే ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గలేదన్నారు. గత ఏడాది కోల్డ్ ఇంజ్యూరీలు 0.13 శాతం కాగా, ఈ ఏడాది 0.15 శాతం నమోదు అయ్యాయి. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నామని, ఎల్ఏసీకి చెందిన సెంట్రల్, ఈస్ట్రన్ సెక్టార్లలో ఘర్షణాత్మక ప్రాంతాలు ఉన్నాయని, అక్కడే చైనా తన మౌళిక వసతులను ఏర్పాటు చేసిందన్నారు. వారి కదలికలపై నిత్యం నిఘా పెడుతున్నామని, దాని ఆధారంగానే తమ వ్యూహాలను మార్చుకుంటున్నట్లు నరవాణే తెలిపారు.
తాజావార్తలు
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి