బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 02:25:17

జడ్జి బదిలీపై వివాదం

జడ్జి బదిలీపై వివాదం
  • ఢిల్లీ హింసాకాండ నేపథ్యంలో పోలీసులపై జస్టిస్‌ మురళీధర్‌ ఆగ్రహం
  • గంటల వ్యవధిలోనే బదిలీ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధర్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడంపై వివాదం రాజుకున్నది. ఢిల్లీలో హింసాకాండకు ఆజ్యం పోసేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై కేసు నమోదు చేయనందుకు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంటల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘అర్ధరాత్రి ఉత్తర్వులు’ సిగ్గుచేటు అని కాంగ్రెస్‌ ధ్వజమెత్తగా.. సాధారణ బదిలీని రాజకీయం చేస్తున్నారని ఆ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. జస్టిస్‌ మురళీధర్‌తోపాటు, మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్‌ రంజిత్‌ వసంత్‌రావ్‌ మోరే (బాంబే హైకోర్టు), జస్టిస్‌ రవి విజయ్‌ కుమార్‌ మాలిమత్‌ (కర్ణాటక హైకోర్టు)లను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం రాత్రి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. జస్టిస్‌ మురళీధర్‌ను పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బదిలీ చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత ఈ బదిలీలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఏఏ నిరసనలకు సంబంధించి బీజేపీ నేతలు పర్వేశ్‌ వర్మ, కపిల్‌ మిశ్రా, అనురాగ్‌ ఠాకూర్‌లు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయనందుకు ఢిల్లీ పోలీసులపై జస్టిస్‌ మురళీధర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసిన గంటల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేయడం గమనార్హం. 


కేంద్రం ప్రతీకార చర్యలు: కాంగ్రెస్‌

ఢిల్లీ హింస కేసులో బీజేపీ నేతలను రక్షించేందుకే జస్టిస్‌ మురళీధర్‌ను ఆకస్మికంగా బదిలీచేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. న్యాయవ్యవస్థపై బీజేపీ అణచివేతను, ప్రతీకార రాజకీయాలను ఇది బట్టబయలుచేసిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. ‘బదిలీకాని, ధైర్యశాలి జస్టిస్‌ లోయాను గుర్తుచేసుకుంటున్నాం’ అని ట్వీట్‌చేశారు. అమిత్‌షా నిందితుడిగా ఉన్న (తర్వాత నిర్దోషిగా కోర్టు ప్రకటించింది) సోహ్రబుద్దీన్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసును విచారించిన జస్టిస్‌లోయా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


కొలీజియం సిఫార్సుల మేరకే బదిలీ: బీజేపీ

ఈ నెల 12న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల మేరకే జస్టిస్‌ మురళీధర్‌ను బదిలీ చేసినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టంచేశారు. సాధారణ బదిలీ ప్రక్రియను కాంగ్రెస్‌ రాజకీయం చేస్తున్నదని విమర్శించారు.logo