శనివారం 23 జనవరి 2021
National - Dec 27, 2020 , 13:41:54

దేశ యువ‌త త‌లుచుకుంటే ఏదైనా సాధ్య‌మే: ప‌్ర‌ధాని మోదీ

దేశ యువ‌త త‌లుచుకుంటే ఏదైనా సాధ్య‌మే: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: భారతదేశ‌ యువతను చూసినప్పుడల్లా తనలో భరోసా పెరుగుతుందని, మనసు ఉల్లాసంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఏదైనా సాధించగల, చేయగల స‌త్తా వారిలో ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. ఎంతటి సవాలైనా వారి ముందు చిన్నదేన‌ని, పెద్ద విష‌యం కాద‌ని ప్ర‌ధాని చెప్పారు. యువ‌త‌వల్ల సాధ్యం కానిది ఏదీ లేదంటూ వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. ఈ ఏడ‌దిలో చివ‌రిది, మొత్తంగా 72వ‌ది అయిన 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

స్వయం సమృద్ధి, భారత్‌లో తయారీ వంటి పలు కీలక అంశాలపై ప్ర‌ధాని మోదీ తన అభిప్రాయాల‌ను వెల్లడించారు. నూత‌న సంవ‌త్స‌రం 2021లోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో భారత్‌ను సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ రహిత దేశంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ తీర్మానించుకోవాలని సూచించారు. అదేవిధంగా దేశీయంగా తయారైన వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

దేశంలో తయారీదారులంతా నాణ్యమైన వస్తువుల ఉత్పత్తికి కంకణబ‌ద్ధులై ఉండాల‌ని ప్ర‌ధాని కోరారు. 2020లో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. అయినా ఎక్కడా వెనుకడుగు వేయలేదని, ప్రతి సవాల్‌ నుంచి ఓ పాఠం నేర్చుకున్నామని చెప్పారు. దిల్లీలోని ఝందేవాలా మార్కెట్‌లో ఒకప్పుడు విదేశీ ఆట వస్తువులే ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు అక్క‌డ‌ కేవలం దేశీయంగా తయారైన ఆట బొమ్మల‌నే విక్రయిస్తున్నారని ప్ర‌ధాని తెలిపారు.

అదేవిధంగా దేశానికి చెందిన పలువురు సిక్కు సాధువులు, మత గురువుల త్యాగాలను ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. సాహిబ్ జాదే, మాతా గుజ్రీ, గురు తేజ్‌ బహదూర్, గురు గోవింద్ సింగ్‌ వంటి వారి త్యాగాలకు మనమంతా ఎంతో రుణపడి ఉన్నామని చెప్పారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పంజాబీ రైతులు ఆందోళన చేస్తున్న సంద‌ర్భంలో ప్ర‌ధాని సిక్కు సాధువుల త్యాగాలను స్మరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

దేశంలో 2014-18 సంవ‌త్స‌రాల‌ మధ్య చిరుత పులుల జనాభా 60 శాతం పెరిగిందని ప్ర‌ధాని వెల్ల‌డించారు. ఒకప్పుడు దేశంలో 7,900 చిరుత పులులు ఉండేవని, 2019 నాటికి ఆ సంఖ్య‌ 12,852కు పెరిగింద‌ని చెప్పారు. ముఖ్యంగా మధ్య భారతదేశంలో చిరుత‌ల‌ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. చిరుత‌ల‌తోపాటు సింహాలు, పెద్ద‌ పులుల సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. కశ్మీరీ 'కేస‌ర్‌'కి ఈ ఏడాది జీఐ ట్యాగ్‌ లభించింద‌ని, ఇక దాన్ని అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo