మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 19:05:05

ప్లాస్మా థెరపీతో ప్రయోజనం లేదట.. ఎయిమ్స్‌ విశ్లేషణలో వెల్లడి..

ప్లాస్మా థెరపీతో ప్రయోజనం లేదట.. ఎయిమ్స్‌ విశ్లేషణలో వెల్లడి..

న్యూఢిల్లీ: కొవిడ్‌-19కు సంబంధించి మరో చేదు వార్త. ఇప్పటిదాకా కరోనా చికిత్సకున్న ఏకైక మార్గంగా భావిస్తున్న ప్లాస్మా థెరపీతో ప్రయోజనం లేదట. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ప్లాస్మాను తీసుకొని, అందులోని ప్రతిరక్షకాలను (యాంటీబాడీస్‌)ను కరోనా పాజిటివ్‌ రోగికి ఎక్కిస్తారు. ఈ యాంటీబాడీస్‌ అతడిలోని వైరస్‌తో పోరాడుతాయి. దీన్నే ప్లాస్మా థెరపీ అంటున్నాం. ఇప్పుడు చాలాచోట్ల ప్లాస్మా బ్యాంకులు కూడా వెలిశాయి. అయితే, ఈ ప్లాస్మా థెరపీ అనేది కొవిడ్‌-19 రోగుల మరణాలను తగ్గించడంలో అంత ప్రభావమేమీ చూపించడం లేదని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) చేసిన యాదృచ్ఛిక నియంత్రిత ట్రయల్స్‌ మధ్యంతర విశ్లేషణలో తేలింది.    

30 మంది కొవిడ్ -19 రోగులపై నిర్వహించిన ట్రయల్స్‌లో ప్లాస్మా థెరపీ అనేది కరోనా మరణాలను తగ్గించడంలో తోడ్పడం లేదని కనుగొన్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా గురువారం ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. ట్రయల్స్‌ సమయంలో ఒక సమూహ రోగులకు ప్రామాణిక సహాయక చికిత్సతో పాటు స్వస్థత కలిగిన ప్లాస్మా చికిత్స అందజేశారు. మరొక సమూహానికి ప్రామాణిక చికిత్సను మాత్రమే అందించారు. అయితే, రెండు గ్రూపుల్లో నమోదైన మరణాల సంఖ్య సమానంగా ఉందని, రోగుల స్థితిలో క్లినికల్ మెరుగుదల లేదని గులేరియా వెల్లడించారు. అయితే, ఇది కేవలం మధ్యంతర విశ్లేషణ మాత్రమేనని, ప్లాస్మా చికిత్స ద్వారా ఏదైనా బ్లడ్‌ గ్రూప్‌నకు ప్రయోజనం ఉందా? అనేది తాము ఇంకా పరిశీలించాల్సి ఉందన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo