సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 14, 2020 , 17:35:56

వచ్చే ఎన్నికల్లో పెద్ద పార్టీలతో పొత్తుండదు : అఖిలేష్ యాదవ్

వచ్చే ఎన్నికల్లో పెద్ద పార్టీలతో పొత్తుండదు : అఖిలేష్ యాదవ్

ఎటావా: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తన మామకు చెందిన పార్టీ ప్రగతీషీల్ సమాజ్ వాదీ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నది. మరో నాలుగైదు చిన్నపార్టీలతో ఎన్నికల అవగాహనకు రావాలని సమాజ్‌వాదీ పార్టీ అధిష్టానం యోచిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి-మార్చిలో జరుగనున్నాయి. అ సమయానికల్లా నాలుగైదు చిన్నపార్టీలతో అవగాహనకు రావడం, ముందస్తుగానే అభ్యర్థులను రంగంలోకి దింపడంవంటి చర్యలకు సమాజ్‌వాదీ పార్టీ ఉపక్రమిస్తున్నది. 

తన మామ పార్టీతో ఎన్నికల ఒప్పందం చేసుకున్నట్లు శనివారం ప్రకటించిన అఖిలేష్ యాదవ్‌.. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తో ఎలాంటి ఎన్నికల అవగాహనలోకి వెళ్లదని ఆయన స్పష్టం చేశారు. "చిన్న పార్టీలతో సర్దుబాటు జరుగుతున్నది, కాని పెద్ద పార్టీలతో పొత్తు ఉండదు" అని అఖిలేష్ యాదవ్ ఎటావాలో మీడియాతో అన్నారు. తన మామ శివపాల్ యాదవ్ నేతృత్వంలోని ప్రగతిషీల్ సమాజ్ వాదీ పార్టీతో సర్దుబాటు చేసుకున్నామన్నారు. జస్వంత్ నగర్ స్థానాన్ని మామ శివపాల్ యాదవ్ కోసం సమాజ్‌వాదీ పార్టీ ఖాళీ చేసిందని చెప్పారు. 2022లో మేం అధికారంలోకి వస్తే వారి నాయకుడిని క్యాబినెట్ మంత్రిగా చేస్తాం అని పేర్కొన్నారు.

అఖిలేష్ యాదవ్‌కు మామ అయిన శివపాల్ యాదవ్ 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జస్వంత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. తరువాత ప్రగతీషీల్ సమాజ్ వాదీ పార్టీ (లోహియా) అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించి 2019 లోక్‌సభ ఎన్నికలలో ఫిరోజాబాద్ నుంచి పోటీ చేశారు. ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో 'మహాగట్బంధన్' ను ఓడించడానికి బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపించిన అఖిలేష్ యాదవ్.. "మహాగట్బంధన్ ర్యాలీల్లో గరిష్ట ప్రజల మద్దతు కనిపించిందని చెప్పారు. అలాగే, అన్ని సర్వేలు మహాగల్బంధన్‌ వైపే సూచించాయన్నారు. లెక్కింపు సమయంలో ఏదో తిరకాసు జరిగి విజయం బీజేపీ వైపు వెళ్లిందని చెప్పారు. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఎన్నికల అధికారులతోపాటు పోలీసు అధికారులు, జిల్లాన్యాయాధికారులు సహకరించారని, బీజేపీ అభ్యర్థుల మాదిరిగా అధికారులు పనిచేశారని ఆరోపించారు.

ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్, బీఎస్పీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు చేరడం ఎస్పీని బలోపేతం చేస్తుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.