సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 19:45:09

సచిన్ పైలట్, 18 మంది ఎమ్మెల్యేలపై అప్పటి వరకు చర్యలొద్దు..

సచిన్ పైలట్, 18 మంది ఎమ్మెల్యేలపై అప్పటి వరకు చర్యలొద్దు..

జైపూర్: సచిన్ పైలట్, ఆయన వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 21 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి ఎదురుతిరిగిన సచిల్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు సీఎల్పీ భేటీకి గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల్లో సమాధానం చెప్పాలంటూ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై సచిన్ టీమ్ స్పందించలేదు. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించాలని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ నేపథ్యంలో ఆయన ఆ మేరకు వారికి నోటీసులు పంపారు.

మరోవైపు సచిన్ అనుచరుడైన ఎమ్మెల్యే పృథ్వీరాజ్ మీనా అనర్హత నోటీసులపై రాజస్థాన్ హైకోర్టులో గురువారం సవాల్ చేశారు. వీరి పిటిషన్లపై కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అటార్నీ జనరల్‌ ముకుల్ రోహత్గి, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సచిన్ పైలట్ టీమ్ తరుఫున కోర్టులో వాదించారు. అసెంబ్లీ స్పీకర్ జోషి తరుఫున హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింగ్వి సోమవారం తన వాదనలు వినిపిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్, 18 మంది ఎమ్మెల్యేలకు జారీ చేసిన అనర్హత నోటీసులపై స్పీకర్ జోషి మంగళవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మొహంతి, జస్టిస్ ప్రకాష్ గుప్తాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మరోవైపు సచిన్ పైలట్, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ ద్వారాలు తెరిచే ఉంటాయని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మరోసారి పునరుద్ఘాటించింది. అలాగే సచిన్ పైలట్‌ను జైపూర్‌కు తిరిగి రావాలని పార్టీ అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తున్నది.  
 logo