బుధవారం 03 జూన్ 2020
National - Apr 01, 2020 , 01:33:06

‘మర్కజ్‌' ప్రకంపనలు

‘మర్కజ్‌' ప్రకంపనలు

-కరోనా తాజా కేంద్రంగా ఢిల్లీ ‘నిజాముద్దీన్‌'

-మత కార్యక్రమంలో పాల్గొన్నవారి ఆచూకీ కోసం ముమ్మర యత్నాలు

-కార్యక్రమానికి హాజరైన 24 మందికి పాజిటివ్‌

-ఢిల్లీ ప్రభుత్వం ప్రకటన.. నిజాముద్దీన్‌ మౌలానాపై కేసు నమోదు

న్యూఢిల్లీ, మార్చి 31: దేశవ్యాప్తంగా ‘మర్కజ్‌' ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతం.. దేశంలో కరోనా వ్యాప్తికి తాజా కేంద్రంగా మారింది. రాష్ర్టాల్లో వెలుగుచూస్తున్న కరోనా కేసులకు చాలా వరకు ఇక్కడే మూలాలు ఉన్నాయి. తబ్లిగీ జమాత్‌ సంస్థకు చెందిన అంతర్జాతీయ ప్రధాన కార్యాలయమైన ‘నిజాముద్దీన్‌ మర్కజ్‌'లో ఈ నెల 1-15 మధ్య మతపరమైన కార్యక్రమం జరిగింది. విదేశీయులతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న 24 మందికి కరోనా సోకినట్లు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 441 మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో దవాఖానకు తరలించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. సమావేశంలో పాల్గొన్న వారి ఆచూకీ గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గత నెల రోజుల్లో దాదాపు 8,000 మంది ఈ మర్కజ్‌ను సందర్శించినట్లు అంచనా.  

విదేశీయుల్లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వాసులు

నిజాముద్దీన్‌ మర్కజ్‌లో గత రెండురోజులుగా ఢిల్లీ పోలీసులు 1,830 మందిని గుర్తించగా, వారిలో 281 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రకటన తర్వాత కూడా వీరు మర్కజ్‌లోనే ఉన్నారు. విదేశీయుల్లో ఇండోనేషియా (74 మంది), శ్రీలంక (34), మయన్మార్‌ (33), కిర్గిస్థాన్‌ (28), మలేసియా (20), నేపాల్‌ (9), బంగ్లాదేశ్‌ (9), థాయ్‌లాండ్‌ (7), ఫిజి (4), బ్రిటన్‌ (3), ఆఫ్ఘనిస్థాన్‌, అల్జీరియా, జిబౌతి, సింగపూర్‌, ఫ్రాన్స్‌, కువైట్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మిగిలిన 1549 మందిలో తమిళనాడు (501), అసోం (216), ఉత్తరప్రదేశ్‌ (156), మహారాష్ట్ర (109), మధ్యప్రదేశ్‌ (107), బీహార్‌ (86), బెంగాల్‌ (73), తెలంగాణ (55), జార్ఖండ్‌ (46), కర్ణాటక (45), ఉత్తరాఖండ్‌ (34), హర్యానా (22), అండమాన్‌ నికోబార్‌ (21), రాజస్థాన్‌(19), హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, ఒడిశా నుంచి 15 చొప్పున, పంజాబ్‌ (9), మేఘాలయకు చెందినవారు ఐదుగురు ఉన్నారు. 

రాష్ర్టాలు అప్రమత్తం..

మర్కజ్‌ సమావేశానికి హాజరైన వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లివచ్చినవారు స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని తెలుగు రాష్ర్టాలు విజ్ఞప్తి చేశాయి. ఏపీలో మంగళవారం 17 కొత్త కేసులు నమోదుకాగా, అందులో 14 మంది మర్కజ్‌ కార్యక్రమానికి హాజరైనవారే. తమిళనాడులోనూ 57 కొత్త కేసులు నమోదుకాగా, అందులో 50 మంది మర్కజ్‌కు వెళ్లొచ్చినవారే.తమిళనాడు నుంచి 1500 మంది వెళ్లారని, వారిలో 981 మంది తిరిగొచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి 157 మంది,  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి దాదాపు 100 మంది చొప్పున, కర్ణాటక నుంచి 54 మంది కార్యక్రమానికి హాజరైనట్లు గుర్తించారు. 

 తబ్లిగీ కార్యక్రమాల కోసం 2,100 విదేశీయులు 

తబ్లిగీ కార్యకలాపాల కోసం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 2,100 మంది విదేశీయులు భారత్‌కు వచ్చినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. మార్చి 21 నాటికి 821 మంది దేశంలోని వివిధ మర్కజ్‌లకు తరలివెళ్లగా, 216 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ఉండిపోయినట్లు తెలిపింది. మిగిలిన వారు లాక్‌డౌన్‌కు ముందే దేశం విడిచి వెళ్లిపోయి ఉండొచ్చని పేర్కొంది. 824 మంది విదేశీయుల వివరాలును ఈ నెల 21న అన్ని రాష్ర్టాల పోలీసులకు పంపామని, వారిని గుర్తించి క్వారంటైన్‌ చేయాల్సిందిగా సూచించామని తెలిపింది. అలాగే భారత్‌కు చెందిన కార్యకర్తలను గుర్తించాల్సిందిగా ఈ నెల 28న రాష్ర్టాలను కోరామని, ఇప్పటివరకు 2,137 మందిని గుర్తించినట్లు తెలిపింది. 

24 మందికి కరోనా పాజిటివ్‌

నిజాముద్దీన్‌ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 24 మందికి కరోనా సోకినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. మర్కజ్‌ నుంచి 1548 మందిని తరలించినట్లు, వారిలో 441 మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. కరోనా విజృంభణ సమయంలో మత కార్యక్రమం నిర్వహించడం పూర్తి బాధ్యతారాహిత్యమైన చర్య అని మండిపడ్డారు. కాగా, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి  సమావేశం నిర్వహించినందుకు నిజాముద్దీన్‌ మౌలానాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు.

వారికి వీసాలు నిషేధం

తబ్లిగీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చే విదేశీయులకు వీసాలు మంజూరు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 2100 మంది విదేశీయులు టూరిస్ట్‌ వీసాపై వచ్చి మత కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. కాగా, మత కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 300 మంది విదేశీయులను బ్లాక్‌లిస్ట్‌ చేర్చనున్నట్లు ఓ అధికారి తెలిపారు. 

నిబంధనలు ఉల్లంఘించలేదు మర్కజ్‌ నిజాముద్దీన్‌ వివరణ  

తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ‘మర్కజ్‌ నిజాముద్దీన్‌' స్పష్టంచేసింది. అధికారులకు సహకరిస్తామని తెలిపింది. కరోనా నేపథ్యంలో తమ పరిసరాలను క్వారంటైన్‌ కోసం ఉపయోగించుకోవచ్చని సూచించింది. న్యాయపరమైన చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమవడంతో మర్కజ్‌ స్పందించింది. ‘ఈ పూర్తి ఎపిసోడ్‌లో మర్కజ్‌ ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదు. ఏడాది ముందుగానే నిర్ణయించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి ఇక్కడకు భారీగా సందర్శకులు/ భక్తులు వచ్చారు. జనతా కర్ఫ్యూ, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా వారంతా ఇక్కడే చిక్కకుపోయారు. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా మార్చి 23న దాదాపు 1500 మంది వెళ్లిపోయారు. మిగిలిన వారికి ఇక్కడే వసతి కల్పించాల్సి వచ్చింది. మర్కజ్‌ను మూసివేయాలని 24న పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. దాదాపు 1000 మంది ఇక్కడ ఉన్నారని, వారిని స్వస్థలాలకు పంపేందుకు ట్రావెల్‌ పాస్‌లు ఇవ్వాలని అదేరోజు పోలీసులను కోరాం. ఇంతవరకు అనుమతి రాలేదు’ అని వివరించింది. జమాత్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి 

‘తబ్లిగీ జమాత్‌ అనేది ముస్లిం మతవాద ఉద్యమం. 1926లో హర్యానాలోని మేవాట్‌లో ఇది ప్రారంభమైంది. 150 దేశాల నుంచి 1.2 కోట్ల నుంచి 8 కోట్ల మంది ముస్లింలు ఈ జమాత్‌కు హాజరవుతుంటారు. ఉజ్బెకిస్థాన్‌, తజికిస్థాన్‌,కజకిస్థాన్‌ దేశాలు దీనిని నిషేధించాయి. ఉగ్రవాదులతో జమాత్‌కు పరోక్ష సంబంధాలున్నాయి

-తస్లీమా నస్రీన్‌, రచయిత్రి 

ముస్లింలను బద్నాం చేయొద్దు

‘దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి ముస్లింలను బద్నాం చేయడం సరికాదు. ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరైన వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌ అని తేలినంతమాత్రాన దేశంలో ఈ వైరస్‌ వ్యాప్తికి ముస్లింలే కారణమని నిందించడం భావ్యంకాదు. ముస్లింలవైపు వేలెత్తి చూపడానికి ఇప్పుడు కొంతమందికి ఇది ఓ సాకుగా మారింది. దేశంలో అందరిలాగే ముస్లింలుకూడా ప్రభుత్వ మార్గదర్శకాలను, సలహాలను పాటిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’

-ఒమర్‌ అబ్దుల్లా, కశ్మీర్‌ మాజీ సీఎం

ప్రజారోగ్యంలో స్వావలంబన అవసరం 

‘పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్‌ సోకిన బాధితుల విషయంలో జాగ్రత్తలు తీసుకొంటే కొవిడ్‌-19 సంక్షోభాన్ని దేశం సమర్థంగా ఎదుర్కోగలదు. వ్యాధి తీవ్రత విషయంలో మాత్రమే ఆందోళన అవసరం. ఎక్కువమందికి సోకితే చికిత్స అందించడం కష్టమవుతుంది. వ్యాధిపై జరుగుతున్న పోరాటంలోకి ప్రైవేటు వైద్యరంగాన్ని తీసుకురావడంలో జాప్యం జరిగింది. లాక్‌డౌన్‌తో స్వీయదిగ్బంధంలో ఉన్న 90 శాతంమంది కోలుకుంటారు. తక్కువ ఖర్చు తో స్వదేశీ పరీక్ష కిట్ల తయారీకి చిన్న కంపెనీలు ముందుకురావడం ప్రజారోగ్యంలో స్వావలంబన అవసరాన్ని గుర్తుచేస్తుంది. మనం ఆరోగ్య సంరక్షణ రంగంలోకన్నా ఇతర రంగాల్లోనే ఎక్కువ పెట్టుబడులను పెట్టాం. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించాం. ఎంత సంపద ఉన్నా కరోనావంటి వైరస్‌ విజృంభిస్తే ఏమీ చేయలేం’ 

-కిరణ్‌ మజుందార్‌షా, బయోకాన్‌ సీఎండీ 


logo