ఆదివారం 07 జూన్ 2020
National - Mar 31, 2020 , 22:38:24

జమ్ముకశ్మీర్‌లో నిజాముద్దీన్‌ ప్రకంపనలు

జమ్ముకశ్మీర్‌లో నిజాముద్దీన్‌ ప్రకంపనలు

న్యూఢిల్లీ, : నిజాముద్దీన్‌ ప్రకంపనలు కశ్మీర్‌లోనూ వినిపిస్తున్నాయి. శ్రీనగర్‌కు చెందిన ఒక వ్యాపారి తబ్లిగి జమాత్‌ సదస్సుకు హాజరై విమానాల్లో, రైళ్లలో ఇతర ప్రాంతాలకూ ప్రయాణించి తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు. వచ్చిన కొన్ని రోజుల్లోనే కరోనాతో ఆయన మరణించారు. కశ్మీర్‌లో తొలి కరోనా మృతి అతడిదే. ఈ నేపథ్యంలో.. ఆ వ్యాపారి ద్వారా ఎంతమందికి కరోనా వైరస్‌ వ్యాపిందన్నదానిపై కశ్మీర్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. సదరు వ్యాపారితో కలిసి లాడ్జిలో ఉన్న అతడి మిత్రుడు, స్వయంగా వైద్యుడైన అతడి మిత్రుడి పరిస్థితి ప్రస్తుతం కరోనాతో విషమంగా ఉంది. వ్యాపారితో కలిసి ప్రయాణించిన వారిలో దాదాపు 300 మందిని క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. 

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. జమాత్‌ సదస్సు కోసం సదరు వ్యాపారి మార్చి ఏడో తేదీన ఢిల్లీకి విమానంలో చేరుకున్నారు. తర్వాత రెండు రోజులకు (మార్చి 9) ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌కు రైలులో వెళ్లారు. అక్కడ అదేరోజు దారూల్‌ ఉలూమ్‌ సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. మార్చి 11న మరో రైలులో జమ్ముకు చేరుకుని అక్కడ వైద్యుడైన తన మిత్రుడితో కలిసి ఓ సభలో మాట్లాడారు. వారిద్దరు మార్చి 16 వరకు జమ్ములోని ఓ లాడ్జిలో బస చేశారు. మార్చి 16న విమానంలో శ్రీనగర్‌కు చేరుకున్న ఆ వ్యాపారి.. అక్కడ నుంచి సొపోర్‌కు వెళ్లారు. తిరిగి మార్చి 18న శ్రీనగర్‌కు రోడ్డు మార్గంలో చేరుకున్నారు.

 ఫ్లూ జ్వరం, ఛాతిలో నొప్పి వస్తుందని మార్చి 21న స్థానిక దవాఖానలో చేరిన ఆ వ్యాపారిని తర్వాత శ్రీనగర్‌లోని ఎస్‌కేఐఎంఎస్‌ దవాఖానకు తరలించారు. తొలి దశలో అలర్జీ కేసుగా పరిగణించిన వైద్యులు.. మరునాడు (మార్చి 22) పరిస్థితి దిగజారడంతో శ్రీనగర్‌ ఛెస్ట్‌ అండ్‌ డిసీజ్‌ దవాఖానకు తరలించారు. ఆ దవాఖానలో 26న సదరు వ్యాపారి మరణించారు. జమ్ముకశ్మీర్‌లో తొలి కరోనా వైరస్‌ మృతి ఈ వ్యాపారిదే కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సదరు వ్యాపారి ప్రయాణించిన విమానాలు, రైళ్లలో ఇతర ప్రయాణికుల వివరాలను సేకరించి.. వారిలో సుమారు 300 మంది అనుమానితులను క్వారంటైన్‌కు పంపారు. వ్యాపారి మిత్రుడైన వైద్యుడు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. సదరు వైద్యుడి నివాస ప్రాంతం రాజౌరి ప్రాంతంలో ఉండే 45 మందిని క్వారంటైన్‌కు పంపారు. సదరు వ్యాపారికి చికిత్స అందించిన ఇద్దరు వైద్యులు కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. సొపోర్‌లో సదరు వ్యాపారి నిర్వహించిన సదస్సుకు హాజరైన నలుగురు బందిపొర జిల్లా వాసులకు వైరస్‌ సోకి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.logo