శనివారం 16 జనవరి 2021
National - Nov 27, 2020 , 01:09:32

తీరం దాటిన నివర్‌

తీరం దాటిన నివర్‌

  • తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో భారీ వర్షాలు
  • తమిళనాడులో ముగ్గురి మృతి
  • ఏపీలో ఒకరు గల్లంతు.. 
  • నేలకూలిన వందలాది చెట్లు

చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరికి కంటిమీద కునుకు లేకుండా చేసిన నివర్‌ తుఫాన్‌ గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. ‘అతి తీవ్ర తుఫాన్‌గా మారిన నివర్‌ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. ఆపై తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. అది మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, ఆపై వాయుగుండంగా మారనుంది’ అని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. నివర్‌ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో ఉద్ధృతమైన గాలులతోకూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. వందల చెట్లు నేలకూలాయి. తమిళనాడులో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మరణించారు. దక్షిణ చెన్నైలోని పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. అత్యధికంగా పుదుచ్చేరిలో 30 సెంటీమీటర్లు, కడలూరులో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం చెన్నై నుంచి విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. మెట్రో రైలు, బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. ఏపీలోని నెల్లూరులో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చిత్తూరు జిల్లాలో వరద ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు రైతులను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బం ది కాపాడగా, మరో రైతు కొట్టుకుపోయాడు. తిరుమల కొండపై కుండపోతతో వందలమంది భక్తులు చిక్కుకుపోయారు. 

తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నివర్‌ ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. జోగుళాంబ గద్వాల్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, జనగామ, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురువొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. హైదరాబాద్‌లో ఓ మోస్తరు వానలు పడతాయన్నారు.