సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 16:52:26

ఏడోసారి సీఎంగా నితీశ్ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌..

ఏడోసారి సీఎంగా నితీశ్ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌..

హైద‌రాబాద్‌:  బీహార్ సీఎంగా నితీశ్ కుమార్‌.. ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు.  ఆ రాష్ట్ర సీఎంగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఇది ఏడో సారి. అయితే వ‌రుస‌గా నాలుగో సారి ఆయ‌న జేడీయూ చీఫ్‌గా సీఎం బాధ్య‌త‌లను  స్వీక‌రించారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. ఎన్డీఏ కూట‌మి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.  బీహార్ సీఎం అభ్య‌ర్థిగా ఏన్డీఏ కూట‌మి త‌ర‌పున నితీశ్ కుమార్ పోటీ చేశారు. పాట్నాలోని రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ ఫాగూ చౌహాన్ .. నితీశ్ కుమార్‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు.  బీజేపీ నేత‌లు తార్‌కిషోర్ ప్ర‌సాద్‌, రేణు దేవీలు.. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంలుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,  మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌లు .. నితీశ్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌ర‌య్యారు. నితీశ్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వాన్ని ఆర్జేడీ పార్టీ బాయ్‌కాట్ చేసింది. జేడీయూ నేత‌లు విజ‌య్ కుమార్ చౌద‌రీ, విజేంద్ర ప్ర‌సాద్ యాద‌వ్‌, అశోక్ చౌద‌రీ, మేవా లాల్ చౌద‌రీలు.. క్యాబినెట్ మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. 

నితీశ్ ప్ర‌మాణ స్వీకారం చేసిన నేప‌థ్యంలో.. సుశీల్ మోదీ కంగ్రాట్స్ తెలిపారు.  ఏడోసారి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశార‌ని, మీ నాయ‌క‌త్వంలో బీహార్ మ‌రింత ముందుకు వెళ్తుంద‌ని,  ప్ర‌ధాని మోదీ మ‌ద్ద‌తు బీహార్‌కు ఎళ్ల‌వేళ‌లా ఉంటుంద‌ని సుశీల్ మోదీ త‌న ట్వీట్‌లో తెలిపారు. బీహార్ అసెంబ్లీ స్పీక‌ర్‌గా నంద‌కిశోర్ యాద‌వ్ నియ‌మితుల‌య్యారు. ఇవాళ క్యాబినెట్ మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వారిలో మాజీ సీఎం జిత‌న్ రామ్ మంజీ(హిందుస్తానీ అవామీ మోర్చా) కుమారుడు సంతోష్ కుమార్ సుమ‌న్‌,  వికాశ్ షీల్ ఇన్సాన్ పార్టీ నేత ముఖేశ్ స‌హానిలు ఉన్నారు.