ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 12, 2020 , 02:08:05

నితీశే సీఎం.. కానీ ఎన్నాళ్లు?

నితీశే సీఎం.. కానీ ఎన్నాళ్లు?

  • ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అనిశ్చితి
  • పూర్తికాలం కొనసాగడంపై సందేహాలు
  • కేంద్ర మంత్రిగా లేదా గవర్నర్‌గా వెళ్లే చాన్స్‌
  • ఉప రాష్ట్రపతిగా పోటీ చేసే అవకాశం

న్యూఢిల్లీ, నవంబర్‌ 11: బీహార్‌ సీఎం పీఠాన్ని మళ్లీ అధిష్ఠించేది జేడీయూ అధినేత నితీశ్‌ కుమారేనన్నది నిస్సందేహం. అయితే ఎన్నాళ్లు ఆయన ఆ పదవిలో కొనసాగుతారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న.  ఎన్‌డీఏ సీఎం అభ్యర్థి నితీశేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు.బీహార్‌ ఎన్నికలు ముగిశాయి. నితీశ్‌ సారథ్యంలోని జేడీయూకి 43 సీట్లు మాత్రమే రాగా, బీజేపీ 74 సీట్లు గెలుచుకుంది. ఫలితాలు వస్తున్నప్పుడే జేడీయూ వెనుకబడుతుండడం చూసి బీజేపీ నేతలు గళం విప్పడం మొదలుపెట్టారు. బీహార్‌లో బీజేపీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడానికి ఇదే సమయమని ఆ పార్టీ అనుబంధ విభాగమైన ఎస్సీ, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అజిత్‌ చౌదరి పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో‘హిందీ హార్ట్‌ల్యాండ్‌'లో కీలకమైన బీహార్‌లో ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది. 

నాలుగు అవకాశాలు

ఈసారి పూర్తి కాలం నితీశ్‌ పదవిలో కొనసాగకపోవచ్చని, మధ్యలోనే వైదొలగవచ్చన్న వాదన వినిపిస్తున్నది. తనకు ఎక్కువ సీట్లు లభించిన దృష్ట్యా బీజేపీ ఆయనను సీఎం పదవి నుంచి దించి ప్రత్యామ్నాయ పదవుల అవకాశం కల్పించవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు అవకాశాలను ప్రస్తావిస్తున్నారు. ఒకటి- కొన్నాళ్ల తర్వాత నితీశ్‌ను కేంద్ర మంత్రిగా పంపించడం. రెండు- ఏదో ఒక రాష్ర్టానికి గవర్నర్‌గా నియమించడం.  మూడు- 2022లో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను పోటీ చేయించవచ్చు. నాలుగు- ఎన్‌డీఏతో విభేదాలు తప్పకపోతే నితీశ్‌ రాజీనామా చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా తేజస్వీ యాదవ్‌కు మద్దతు ఇవ్వవచ్చు. 

వచ్చే వారం నితీశ్‌ ప్రమాణం!

బీహార్‌ సీఎంగా నితీశ్‌కుమార్‌ దీపావళి తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీలైతే సోమవారం లేదంటే ఆ తర్వాత ఆయన పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

12 ఓట్ల మెజారిటీతో విజయం

జేడీయూ  అభ్యర్థి కృష్ణమురారీ శరణ్‌ కేవలం 12 ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్యర్థి శక్తిసింగ్‌పై గెలుపొందడం వివాదాస్పదమైంది. హిల్సా స్థానం నుంచి వీరిద్దరు పోటీ చేయగా కృష్ణమురారీకి 61,848 ఓట్లు, శక్తిసింగ్‌కు 61,836 ఓట్లు వచ్చినట్లు ఈసీ ప్రకటించింది. ఈ ప్రకటనను ఆర్జేడీ ఖండించింది. ‘547 ఓట్ల మెజారిటీతో ఆర్జేడీ అభ్యర్థి గెలిచినట్లు తొలుత ఈసీ ప్రకటించింది. నితీశ్‌కుమార్‌ నుంచి ఫోన్‌ రాగానే మాటమార్చింది’ అని ట్వీట్‌ చేసింది.

ఒప్పందం ఒప్పందమే.. ఆయనే సీఎం!

 ఒప్పందం ప్రకారం బీహార్‌ సీఎంగా జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌ ఉంటారని బీజేపీ తెలిపింది. బీహార్‌లో జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఉండనున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఆ పార్టీ సీనియర్‌ నేత, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ స్పందిస్తూ ‘ముందుగా అనుకున్నట్లే నితీశ్‌ బీహార్‌ సీఎం అవుతారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు’ అని తెలిపారు. ఎన్నికలన్నాక ఒకరికి ఎక్కువ సీట్లు, మరొకరికి తక్కువ సీట్లు రావడం సహజమని, అంతమాత్రాన జేడీయూని చిన్నచూపు చూడబోమని పేర్కొన్నారు.

నితీశ్‌ సీఎం అయితే ఆ ఘనత శివసేనదే

బీహార్‌ సీఎంగా నితీశ్‌కుమార్‌ తిరిగి నియామకమైతే ఆ గొప్పతనమంతా శివసేనకే దక్కుతుందని ఆ పార్టీ పత్రిక ‘సామ్నా’ వ్యాఖ్యానించింది. ‘2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ-శివసేన మధ్య పొత్తు కుదిరింది. శివసేనకు తక్కువ సీట్లు వచ్చినా సీఎం పీఠాన్ని ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు నాడు బీజేపీ తెలిపింది. కానీ ఎన్నికల అనంతరం మాట మార్చింది. అందుకే మిగతా పార్టీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బీహార్‌లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. జేడీయూకి తక్కువ సీట్లు వచ్చినా నితీశ్‌కుమార్‌ను సీఎం చేస్తామన్నారు. నితీశ్‌ సీఎం అయితే అది శివసేన గొప్పతనమే. ఎందుకంటే అమిత్‌ షా మాట మీద నిలబడకపోతే.. బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం కష్టం. కాబట్టి నితీశ్‌ను సీఎంను చేయక తప్పదు’ అని సామ్నా పేర్కొంది.