బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 03:08:51

తొలిదశ బడ్జెట్‌ సమావేశాలు పూర్తి

తొలిదశ బడ్జెట్‌ సమావేశాలు పూర్తి
  • మార్చి 2 వరకు ఉభయసభలు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ తొలిదశ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఉభయ సభల కార్యక్రమాలు మార్చి 2 వరకు వాయిదాపడ్డాయి. జనవరి 31న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాగా, రాష్ట్రపతి కోవింద్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చజరిగింది. దీని తర్వాత ఉభయసభల్లో బడ్జెట్‌పై చర్చ మొదలైంది. మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు మలిదశ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్‌ను ఆమోదిస్తారు. 


‘తప్పుడు చికిత్సా విధానాలు’ అవసరం లేదు

తమకు ‘తప్పుడు చికిత్సా విధానాలు’ అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ‘అసమర్థ వైద్యులు’ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతున్నదని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం రాజ్యసభలో సోమవారం చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. ఎవరి హయాంలో విదేశీ పెట్టుబడులు తరలిపోయాయో, జాతీయ బ్యాంకులను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయారో, అలాంటి తప్పుడు విధానాలను తాము అనుసరించబోమని తెలిపారు. అలాంటి ‘సమర్థ వైద్యుల’ నుంచి తాను నేర్చుకోదలచుకోలేదని, 2008-09 మధ్య జరిగిన తప్పులపై ‘రోగ నిర్ధారణ’ చేసి ‘చికిత్స’ ప్రారంభించామంటూ ఎద్దేవా చేశారు. తమ పాలనలో సాధించిన ఏడు ప్రత్యేక ఘనతలను సీతారామన్‌ పేర్కొన్నారు. 


సమాచార రక్షణ బిల్లు కమిటీలోకి ఇద్దరు 

సమాచార రక్షణ బిల్లు 2019కి సంబంధించిన పార్లమెంట్‌ సంయుక్త కమిటీలో ఇద్దరు సభ్యులను నియమించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సౌగత రాయ్‌, కాంగ్రెస్‌ ఎంపీ ఎస్‌ జ్యోతిమణి రాజీనామాల నేపథ్యంలో వారి స్థానాలను ఆయా పార్టీలకు చెందిన మహువా మొయిత్రా, మనీష్‌ తివారీతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానానికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. 


logo
>>>>>>