బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 09:23:18

కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత కన్నుమూత

కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత కన్నుమూత

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ బారిన పడి పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుర్బానీ గాయకుడు నిర్మల్‌ సింగ్‌ (62) గురువారం ఉదయం కన్నుమూశారు. నిర్మల్‌ సింగ్‌ ఇటీవలే విదేశాల నుంచి పంజాబ్‌కు వచ్చాడు. మార్చి 30వ తేదీన ఆయనకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నిన్న సాయంత్రం నిర్మల్‌ సింగ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చికిత్స కొనసాగుతుండగానే ఇవాళ ఉదయం 4:30 గంటలకు నిర్మల్‌ సింగ్‌ మృతి చెందినట్లు పంజాబ్‌ విపత్తు నిర్వహణ ప్రత్యేక అధికారి కేబీఎస్‌ సిద్ధూ తెలిపారు. మార్చి 19వ తేదీన చండీఘర్‌లోని నిర్మల్‌ నివాసంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు హాజరయ్యారు. అయితే నిర్మల్‌ భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు, డ్రైవర్‌తో పాటు మరో ఆరుగురికి ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిర్మల్‌ సింగ్‌ 2009లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పంజాబ్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 46కు చేరుకుంది. 


logo