గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 05, 2020 , 16:03:19

నిర్భయ దోషులకు మార్చి 20న ఉరి

నిర్భయ దోషులకు మార్చి 20న ఉరి

న్యూఢిల్లీ : నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు పటియాలా హౌస్‌ కోర్టు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. మార్చి 20వ తేదీన ఉదయం 5:30 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని పటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా ఆదేశాలు జారీ చేశారు. ఉరి శిక్షకు సంబంధించి తీహార్‌ జైల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 

జనవరి 22, ఫిబ్రవరి 1న ఉరి తీయాలంటూ ఇచ్చిన డెత్‌ వారెంట్లపై కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని గతంలో కోర్టు డెత్‌ వారెంట్లు ఇచ్చింది. కానీ గుప్తా.. రాష్ర్టపతికి క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసుకోవడంతో అది కూడా ఆగిపోయింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్‌ వారెంట్లపై స్టే విధించింది పటియాలా హౌస్‌ కోర్టు. అయితే పవన్ కుమార్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ర్టపతి తిరస్కరించడంతో.. నలుగురు దోషులకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలు అయిపోయాయి. దీంతో కోర్టు కొత్త తేదీని ప్రకటించింది.

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలుచేసేందుకు కొత్త తేదీని ఖరారు చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం స్థానిక కోర్టును కోరింది. కేసులో చివరి దోషి పవన్‌కుమార్‌గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ తిరస్కరించిన నేపథ్యంలో బుధవారం ఈ మేరకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు ముగిసిపోయాయని కోర్టుకు తెలిపింది. దీనిపై గురువారంలోగా స్పందన తెలియజేయాలని అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రానా దోషులను ఆదేశించారు. నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది చేసిన వాదనను జడ్జి తోసిపుచ్చారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21(జీవించే హక్కు)లో పొందుపరిచిన సహజ న్యాయ సూత్రాలను, అవతలి వ్యక్తి వాదనను కూడా వినాలన్న నిబంధనను విస్మరించకూడదని పేర్కొంటూ.. దోషులకు నోటీసులు జారీచేశారు. దోషులకు ఉరిశిక్ష అమలుకు కొత్త తేదీ ఖరారు కోసం తీహార్‌ జైలు అధికారులు కూడా పాటియాలా హౌజ్‌ కోర్టును ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి నిర్భయ దోషులు ముకేశ్‌కుమార్‌ సింగ్‌ (32), వినయ్‌శర్మ (26), అక్షయ్‌కుమార్‌ సింగ్‌ (31), పవన్‌కుమార్‌గుప్తా (25)లను మార్చి 3న ఉరితీయాల్సి ఉన్నది. అయితే క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్షను వాయిదావేయాలని పవన్‌ కోర్టును ఆశ్రయించడంతో.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మరణదండనపై స్టే విధిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.


logo
>>>>>>