సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 02:58:54

నిర్భయకు న్యాయం.. దోషులకు ఉరి

నిర్భయకు న్యాయం.. దోషులకు ఉరి

-ఫలించిన ఏడేండ్ల ఎదురుచూపులు

- నలుగురు నిర్భయ దోషుల ఉరితీత 

-ఉదయం 5:30 గంటలకు తీహార్‌ జైలులో శిక్ష అమలు 

-చివరి క్షణం వరకు కొనసాగిన దోషుల ఎత్తుగడలు 

-అర్ధరాత్రి దాటిన తర్వాత సుప్రీంకోర్టుకు 

- అన్ని అభ్యర్థనలను తిరస్కరించిన ధర్మాసనం 

కడుపుకోతను దిగమింగుతూ ఓ తల్లి చేసిన పోరాటం.. ఏడేండ్ల భారతావని ఎదురుచూపులు ఫలించాయి. ఆలస్యమైనా ‘నిర్భయ’కు న్యాయం దక్కింది. మానవత్వం సిగ్గుతో తలదించుకునేలా 2012లో నిర్భయపై అఘాయిత్యానికి పాల్పడిన దోషుల్లో నలుగురికి శుక్రవారం ఉరిశిక్ష అమలుచేశారు. తీహార్‌జైల్లో ఉదయం 5.30 గంటలకు దోషులు ముఖేశ్‌, పవన్‌, వినయ్‌, అక్షయ్‌ని అధికారులు ఉరితీశారు. ఈ విషయం తెలియగానే దేశవ్యాప్తంగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ఉరి నుంచి తప్పించుకునేందుకు దోషులు చివరి నిమిషం వరకు విశ్వప్రయత్నాలు చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అయినా వారి ఎత్తులు పారలేదు. అసాధారణ రీతిలో తెల్లవారుజామున 2.30 గంటలకు విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. 3.15 గంటలకు అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో నలుగురికి ఉరి ఖరారైంది. అనంతరం నిబంధనల ప్రకారం తీహార్‌ జైలు అధికారులు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. ఆలస్యంగానైనా తమకు న్యాయం దక్కిందన్న నిర్భయ తల్లిదండ్రులు.. ఇదే స్ఫూర్తితో చట్టంలోని లొసుగులపై పోరాడుతామని ప్రకటించారు.

న్యూఢిల్లీ, మార్చి 20: యావత్‌ భారతావని ఎదురుచూపులు ఫలించాయి. కడుపుకోతను దిగమింగుతూ.. ఆ తల్లిదండ్రులు చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. 2012లో ప్రపంచం నివ్వెరపోయేలా ‘నిర్భయ’పై జరిగిన ఘాతుకానికి.. ఏడేండ్ల తర్వాత న్యాయం జరిగిం ది. చట్టంలో లొసుగులు అడ్డంపెట్టుకొని దోషులు వేసి  ఎత్తులు చిత్తయ్యాయి. కాస్త ఆలస్యమైనా.. నలుగు  దోషులు ఉరికంబానికి వేలాడారు. నిర్భయ కేసులో దోషులు ముఖేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)ను శుక్రవారం ఉదయం 5:30 గంటలకు తీహార్‌ జైలులో ఉరితీశారు. తమకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తీహార్‌ జైలు ముందు తెల్లవారుజామునుంచే వందల మంది గుమిగూడారు. ఉరి తీసిన వార్త వెలువడగానే హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ‘భారత్‌ మాతా  జై’, ‘నిర్భయ వర్ధిల్లాలి’ వంటి నినాదాలు హోరెత్తాయి. కొంద  స్వీట్లు పంచుకొన్నా రు. సామాజిక కార్యకర్త యోగి  భయాన ‘నిర్భయకు న్యాయం జరిగింది. మరో ఆడబిడ్డ ఇంకా ఎదురుచూస్తున్నది’ అని రాసి ఉన్న బోర్డు పట్టుకున్నారు. 


సుప్రీంకోర్టు అసాధారణ విచారణ 

దోషి పవన్‌కుమార్‌ గుప్తా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుప్రీంకోర్టు తలుపుతట్టాడు. తన రెండో క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేశాడు. ఈ పిటిషన్‌  సుప్రీంకోర్టు అసాధారణ స్థాయిలో విచారణ చేపట్టింది. జస్టిస్‌లు ఆర్‌ భానుమతి, అశోక్‌ భూషణ్‌, ఏఎస్‌ బొపన్న తో కూడిన ధర్మాసనం గురువారం అర్ధరాత్రి దాటా క 2:30 గంటలకు విచారణ ప్రారంభించిన ధర్మాసనం ‘మా తీర్పులను పునఃసమీక్షించాలని మీరు కోరుతున్నారా?’ అని ప్రశ్నించింది. ‘పవన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంపై విచారణకు మాకు ఏ కారణాలు కనిపించడం లేదు’ అని పేర్కొన్నది. పవన్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తెల్లవారుజామున 3:15 గంటలకు తీర్పునిచ్చింది.కాగా, ఉరితీసే సమయంలో నలుగురు దోషుల్లో ఎవరూ ప్రతిఘటించలేదని ఓ తీహార్‌ జైలు అధికారి తెలిపారు. అయితే ఉరికంబం వద్దకు తీసుకొస్తుండగా వినయ్‌ శర్మ ఏడుస్తూ కూలబడిపోయాడని చెప్పారు. ఉరితీతకు ముందు దోషుల కోసం స్నానానికి, అల్పాహారానికి ఏర్పాట్లు చేశామన్నారు. నలుగురూ అల్పాహారం తినలేదని, స్నానం చేయలేదని చెప్పారు. ఉరి అమలు తప్పదని తెలిసినా వారిలో ఏ ఒత్తిడి కనిపించలేదన్నారు. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ముఖేశ్‌ తన కుటుంబ సభ్యులను చివరిసారిగా కలుసుకొన్నాడని, 30 నిమిషాలలు మాట్లాడుకున్నారని చెప్పారు. నలుగురు దోషులు రాత్రంతా సరిగా నిద్రపోలేదన్నారు. 


నిర్భయ కేసు పరిణామక్రమం.. 

 • 2012 డిసెంబర్‌ 16: ఢిల్లీలో పారామెడికల్‌ విద్యార్థిని ‘నిర్భయ’పై కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తుల సామూహిక 
 • లైంగికదాడి. 
 • డిసెంబర్‌ 17: నిందితులు రామ్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌, ఓ మైనర్‌ అరెస్ట్‌.  
 • డిసెంబర్‌ 29: ‘నిర్భయ’ సింగపూర్‌ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి.
 • 2013 జనవరి 2: లైంగికదాడి కేసుల విచారణ వేగవంతం కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ప్రారంభించిన సీజేఐ అల్తమస్‌ కబీర్‌.
 • ఫిబ్రవరి 2: ఐదుగురు నిందితులపై ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో అభియోగాలు నమోదు. 
 • ఫిబ్రవరి 28: బాల నేరస్థుడిపై జువెనైల్‌ జస్టిస్‌ బోర్డులో ఆరోపణలు నమోదు.
 • మార్చి 11: తీహార్‌ జైలులో నిందితుడు రామ్‌ సింగ్‌ ఆత్మహత్య. 
 • సెప్టెంబర్‌ 10: ముకేశ్‌, వినయ్‌, అక్షయ్‌, పవన్‌ను దోషులుగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు.
 • సెప్టెంబర్‌ 13: నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించిన ఢిల్లీ కోర్టు.
 • 2014 మార్చి 13: ఉరి శిక్షపై ఢిల్లీ కోర్టు తీర్పును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు.
 • మే 5: ఉరి శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.
 • 2018 జులై 9: ముకేశ్‌, వినయ్‌, పవన్‌ రివ్యూ పిటిషన్లు తిరస్కరించిన సుప్రీంకోర్టు 
 • ఫిబ్రవరి 28: సుప్రీంకోర్టులో పవన్‌ క్యురేటివ్‌ పిటిషన్‌. మార్చి 2న తిరస్కరణ. రాష్ట్రపతికి పవన్‌ క్షమాభిక్ష అభ్యర్థన. 
 • మార్చి 5: దోషులకు మార్చి 20న ఉరి శిక్ష అమలుకు డెత్‌ వారెంట్లు జారీ.
 • మార్చి 18: ఉరిశిక్షపై స్టే కోరుతూ ట్రయల్‌ కోర్టును ఆశ్రయించిన పవన్‌, వినయ్‌, అక్షయ్‌. 19న తిరస్కరణ.
 • మార్చి 20: ఉరి శిక్ష స్టేపై అర్ధరాత్రి తర్వాత దాఖలైన పిటిషన్లు తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు. తెల్లవారుజామున 5.30 గంటలకు నలుగురు దోషులకు తీహార్‌ జైలులో ఉరి శిక్ష అమలు. 

చివరి కోరికలు ఇవే.. 

తీహార్‌ జైలు అధికారులు నలుగురు దోషులను తెల్లవారుజామున 3:30 గంటలకు నిద్ర లేపారు. తమకు ఉరి ఖాయమని వారికి  అర్థమైంది. ‘చివరి కోరిక’ ఉంటే చెప్పాలని అధికారులు అడుగగా.. స్పందించలేదు. చివ రి క్షణాల్లో ముఖేశ్‌, వినయ్‌ స్పందించారు. ‘ఉరితీసే కొన్ని నిమిషాల ముందు.. ముఖేశ్‌ తన అవయవాలను దానం చేస్తానన్నాడు. వినయ్‌  మాత్రం.. జైలులో ఉండగా తాను గీసిన పె యింటింగ్స్‌ జైలు సూపరింటెండెంట్‌కివ్వాలని, రాసిన హనుమాన్‌ చాలీసాను తన కు టుంబానికి వ్వాలని కోరాడు’ అని ఓ అధికారి తెలిపారు. వినయ్‌ జైలు అధికారులను కూడా క్షమాపణ కోరినట్టు మరో అధికారి చెప్పారు. 

అరగంటపాటు ఉరికంబానికే.. 

ఉరితీత ప్రక్రియ మొత్తం నిబంధనల ప్రకారమే (జైలు మాన్యువల్‌) జరిగిందని తీహార్‌ జైలు డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయల్‌ తెలిపారు. ఉరి తీయడానికి ముందు, తర్వాత వారిని మెడికల్‌ ఆఫీసర్‌ పరీక్షించారని చెప్పారు. నలుగురిని ఉరితీసే సమయంలో జైలు సూపరింటెండెంట్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌, రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌, జిల్లా కలెక్టర్‌, మరొక జైలు అధికారి ఉన్నారని జైలు డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయల్‌ తెలిపారు. తలారి పవన్‌ జల్లాడ్‌ నలుగురు దోషులను ఉరితీసినట్టు చెప్పారు. తర్వాత మృతదేహాలను అరగంటపాటు ఉరికంబానికే వేలాడదీశామన్నారు. నాలుగు శవాలకు ‘దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ హాస్పిటల్‌'లో పోస్ట్‌ మార్టం జరిగిందని, ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని చెప్పారు. ‘అక్షయ్‌ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులు స్వగ్రామమైన బీహార్‌లోని ఔరంగాబాద్‌కు తరలించారు. ముఖేశ్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులు రాజస్థాన్‌కు తీసుకెళ్లారు. పవన్‌, వినయ్‌ మృతదేహాలను ఢిల్లీలోని రవిదాస్‌ క్యాంప్‌నకు తరలించాం’ అని ఓ అధికారి తెలిపారు. తీహార్‌ జైలు చరిత్రలోనే మొదటిసారిగా ఒకేసారి నలుగురిని ఉరి తీశామని వెల్లడించారు. తీహార్‌ జైలులో 16వేల మంది వరకు ఖైదీలు ఉంటారు. దీనిని దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలుగా పిలుస్తారు.

తుదకు న్యాయమే గెలిచింది..

‘నిర్భయ విషయంలో    ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. మహిళలకు భద్రత, గౌరవాన్ని కల్పించడం ముఖ్యం. ప్రతి రంగంలో మహిళాశక్తి రాణిస్తోంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ వారికి సమాన అవకాశాలు కల్పించేలా అందరం కలిసి మెరుగైన దేశాన్ని ఐక్యంగా నిర్మిద్దాం.’

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి


‘ఇలాంటి ఘటన మరొకటి జరుగకుండా ఉండేందుకు అందరూ ప్రతిజ్ఞ చేసుకోవలసిన రోజిది. మరెవరి కుమార్తెకూ నిర్భయ వంటి దారుణం జరుగకుండా ఉండటానికి వ్యవస్థలోని లొసుగులను తొలగించాలని పోలీసులు, కోర్టులు, రాష్ర్టాలు, కేంద్రం సమిష్టిగా తీర్మానం చేయాలి.’

- అరవింద్‌ కేజ్రీవాల్‌,  ఢిల్లీ ముఖ్యమంత్రి


logo