గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 03:10:44

జైలుగోడకు తల బాదుకున్న వినయ్‌

జైలుగోడకు తల బాదుకున్న వినయ్‌
  • నిర్భయ దోషి మరో ఎత్తుగడ.. స్వల్ప గాయాలు
  • అతడి ఆరోగ్యపరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: తీహార్‌ జైలులో ఉన్న నిర్భయ దోషులు ఉరి నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ జైలు గదిలోని గోడకు తల బాదుకున్నాడని అధికారులు తెలిపారు. ‘ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వినయ్‌ తన గదిలో కూర్చున్న సమయంలో గోడకు తల బాదుకున్నాడు. భద్రతా సిబ్బంది చూసి అతడిని అడ్డగించారు. వెంటనే డాక్టర్‌ను పిలిపించి చికిత్స అందించాం’ అని ఓ సీనియర్‌ జైలు అధికారి తెలిపారు. ఈ ఘటనలో వినయ్‌కి స్వల్ప గాయాలయ్యాయని, అతడికి జైలులోనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. వినయ్‌ కొన్నాళ్లుగా సరిగా తినడం లేదని, చిరాగ్గా ఉంటున్నాడని జైలు అధికారులు చెప్తున్నారు. ఇదే కేసులోని మిగతా ముగ్గురు దోషులతో పోలిస్తే భిన్నంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. మరోవైపు వినయ్‌ శర్మ మానసిక స్థితి సరిగా లేదని, స్కిజో ఫ్రేనియాతో బాధపడుతున్నాడని, తలకు గాయాలయ్యాయని, అతడికి మెరుగైన వైద్యం అందించాలంటూ అతడి తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ అదనపు సెషన్స్‌ కోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ తీహార్‌ జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేసింది. నలుగురు నిర్భయ దోషులను మార్చి 3న ఉరితీయాలంటూ ఢిల్లీ కోర్టు ఈ నెల 17న డెత్‌ వారంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.


logo