బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 05, 2020 , 01:53:13

‘ఉరి’కి కొత్తతేదీ!

‘ఉరి’కి కొత్తతేదీ!
  • కోర్టును కోరిన ఢిల్లీ సర్కార్‌
  • పవన్‌ క్షమాభిక్ష అభ్యర్థననుతిరస్కరించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ, మార్చి 4: నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలుచేసేందుకు కొత్త తేదీని ఖరారు చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం స్థానిక కోర్టును కోరింది. కేసులో చివరి దోషి పవన్‌కుమార్‌గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ తిరస్కరించిన నేపథ్యంలో బుధవారం ఈ మేరకు కోర్టులో పిటిషన్‌ దాఖలుచేసింది. దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు ముగిసిపోయాయని కోర్టుకు తెలిపింది. దీనిపై గురువారంలోగా స్పందన తెలియజేయాలని అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రానా దోషులను ఆదేశించారు. నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది చేసిన వాదనను జడ్జి తోసిపుచ్చారు.


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21(జీవించే హక్కు)లో పొందుపరిచిన సహజ న్యాయ సూత్రాలను, అవతలి వ్యక్తి వాదనను కూడా వినాలన్న నిబంధనను విస్మరించకూడదని పేర్కొంటూ.. దోషులకు నోటీసులు జారీచేశారు. దోషులకు ఉరిశిక్ష అమలుకు కొత్త తేదీ ఖరారు కోసం తీహార్‌ జైలు అధికారులు కూడా పాటియాలా హౌజ్‌ కోర్టును ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి నిర్భయ దోషులు ముకేశ్‌కుమార్‌ సింగ్‌ (32), వినయ్‌శర్మ (26), అక్షయ్‌కుమార్‌ సింగ్‌ (31), పవన్‌కుమార్‌గుప్తా (25)లను మంగళవారమే ఉరితీయాల్సి ఉన్నది. అయితే క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్షను వాయిదావేయాలని పవన్‌ కోర్టును ఆశ్రయించడంతో.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మరణదండనపై స్టే విధిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.


ఈ నెలలో ఉరితీస్తారని భావిస్తున్నాం

నిర్భయ దోషి పవన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంపై నిర్భయ తండ్రి స్పందించారు. దోషులకు ఈ నెలలో ఉరిశిక్ష అమలవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘అతడికి ఒకే ఒక అవకాశం మిగిలింది. మిగిలిన దోషుల మాదిరిగానే క్షమాభిక్షపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడం. చూద్దాం ఏం జరుగుతుందో. న్యాయం జరుగుతుందని మాకు విశ్వాసం ఉన్నది. దోషులకు ఈ నెలలో ఉరిశిక్ష అమలవుతుందని భావిస్తున్నాం. సుదీర్ఘ కాలం తర్వాత మాకు న్యాయం జరుగబోతున్నది’ అని పేర్కొన్నారు. 


logo