శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 06:12:37

కాసేపట్లో నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు

కాసేపట్లో నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు

ఢిల్లీ: ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చేసిన అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. చివరికి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌భూషన్‌, జస్టిస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం దానిని కొట్టేసింది. దీంతో నలుగురు దోషులకు ఉదయం 5:30 గంటలకు ఉరిశిక్ష అమలు కానుంది. నిర్భయ దోషులను కలిసేందుకు ఉదయం 5:10 గంటలకు అనుమతి ఇవ్వాలని దోషుల తరపున న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేయగా, దానికి జైలు నిబంధనలు అనుమతించవని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పష్టం చేశారు. 

నిర్భయ దోషులను ఉరితీయడానికి తీహార్‌ జైలులో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారమే తలారి పవన్‌ జల్లాద్‌ జైలుకు చేరుకున్నాడు. బుధవారం అధికారుల సమక్షంలో డమ్మీ ఉరితీత ప్రక్రియ చేపట్టారు. డమ్మీ ఉరి రిహార్సల్‌లో భాగంగా దోషి శరీర బరువుకు 1.5 రెట్లు ఎక్కువ బరువున్న ఇసుకతో నింపిన సంచుల్ని ఉరితాళ్లకు బిగించి 1.830 నుంచి 2.440 మీటర్ల కిందకు వదులుతారు. ఉరి తాళ్ల నాణ్యతను పరీక్షించేందుకు దీన్ని పరీక్షించారు.

 ఉరి అమలు చేసే సమయంలో జైలు సూపరింటెండెంట్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌, మెడికల్‌ ఇంఛార్జ్‌ ఆఫీసర్‌, రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌, జిల్లా మెజిస్టేట్‌ సహా పలువులు పోలీసు అధికారులు ఉంటారు. ప్రక్రియ ముగిసే వరకు దాదాపు గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు. తీహార్‌ జైలులో చివరగా ఉగ్రవాది అఫ్జల్‌గరును 2013 సంవత్సరంలో ఉరితీశారు. ఏడు సంవత్సరాల తరువాత మళ్లీ ఇక్కడ ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఒకేసారి నలుగురిని ఉరితీయడం తీహార్‌ జైలులో ఇదే మొదటి సారి. 


logo