శుక్రవారం 03 జూలై 2020
National - Jan 30, 2020 , 13:06:39

నిర్భయ కేసు.. డెత్‌ వారెంట్లపై స్టే కోరుతూ పిటిషన్‌

నిర్భయ కేసు.. డెత్‌ వారెంట్లపై స్టే కోరుతూ పిటిషన్‌

న్యూఢిల్లీ : ‘నిర్భయ’ కేసులో ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. నలుగురు దోషుల డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలని న్యాయవాది ఏపీ సింగ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయాలన్న వారెంట్లపై స్టే కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. నలుగురు దోషుల న్యాయ అవకాశాలు పూర్తయ్యే వరకు డెత్‌ వారెంట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను మధ్యాహ్నం 2:30 గంటలకు విచారించనుంది పటియాలా హౌస్‌ కోర్టు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ లైంగికదాడి, హత్య కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుపై మరోసారి అనిశ్చితి నెలకొన్నది. ఫిబ్రవరి 1న వారిని ఉరితీయడం అనుమానంగానే ఉన్నది. ఈ కేసులో రెండో దోషి అయిన వినయ్‌కుమార్‌ శర్మ బుధవారం రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలుచేయగా, మూడో దోషి అయిన అక్షయ్‌కుమార్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ను దాఖలుచేశాడు. ఢిల్లీ జైలు నిబంధనల ప్రకారం.. ఒక కేసులో పలువురు దోషులున్నప్పుడు చివరి దోషి కూడా తనకున్న న్యాయపరమైన హక్కులను వినియోగించుకునేంత వరకు వారిలో ఏ ఒక్కరికీ ఉరిశిక్ష అమలు చేయడానికి వీల్లేదు. అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించిన తరువాత 14 రోజుల వరకు దోషులను ఉరితీయకూడదు. నిర్భయ కేసులో నలుగురు దోషులు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ కుమార్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌లను ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరితీయాలని ట్రయల్‌ కోర్టు ఈ నెల 17న రెండోసారి డెత్‌ వారంట్‌ జారీచేసింది. అంతకుముందు ఈ నెల 22న ఉరితీయాలంటూ ఈ నెల 7న వారంట్‌ జారీచేసిన్పటికీ అది వాయిదాపడింది. 


logo