ఆదివారం 24 జనవరి 2021
National - Dec 20, 2020 , 12:22:23

అన్నబాటలోనే తమ్ముడు.. నిహాల్‌ మోదీపై న్యూయార్క్‌లో కేసు

అన్నబాటలోనే తమ్ముడు.. నిహాల్‌ మోదీపై న్యూయార్క్‌లో కేసు

వాషింగ్టన్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీ లాగే.. ఆయన తమ్ముడు నిహాల్‌ మోదీ పయనిస్తున్నాడు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న అతడిపై తాజాగా న్యూయార్క్‌లో కేసు నమోదైంది. నీరవ్‌ సోదరుడు నిహాల్‌ తప్పుడు పత్రాలను చూపి ఎల్‌ఎల్‌డీ డైమండ్స్‌ యూఎస్‌ఏ నుంచి 2.6 మిలియన్‌ డాలర్ల విలువైన వజ్రాలను అరువుపై తీసుకొన్నారు. తర్వాత వాటిని వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించాడని మాన్హాటన్‌ డిస్ట్రిక్‌ అటార్ని సీవై వాన్స్‌ జూనియర్‌ డిసెంబర్‌ 18న ప్రకటించారు. ‘వజ్రాలు ఎప్పటికీ ఉండవచ్చు.. నిహాల్‌ చేసిన ఈ మోసం మాత్రం కాదు. నిహాల్‌ ఇప్పుడు న్యూయార్క్‌ న్యాయస్థానం విచారణను ఎదుర్కొంటారు’ అని సీవై వాన్స్‌ జూనియర్‌ పేర్కొన్నారు. నిహాల్‌ యాంట్వెర్ప్‌లో నివాసం ఉంటున్నాడు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను మోసం చేసిన నీరవ్‌ మోదీకి నిహాల్‌ సోదరుడు. ఈ కేసులో నిహాల్‌పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో ఆయన 27వ నిందితుడిగా ఉన్నాడు. జరిగిన మోసాన్ని కప్పిపెట్టేందుకు దుబాయిలో ఆధారాలను నాశనం చేశాడన్నది ఆయనపై అభియోగం. ఎల్‌ఎల్‌డీ నుంచి వజ్రాలను వేరే సంస్థకు విక్రయిస్తానని తీసుకొని మోసం చేశాడన్నది తాజా అభియోగాల సారాంశం. నిహాల్‌ మోదీ తాను కోస్ట్కో హోల్ సేల్ కార్పొరేషన్‌తో సంబంధం కొనసాగిస్తున్నానని పేర్కొంటూ.. ఎల్‌ఎల్‌డీని ఆశ్రయించాడు. వజ్రాలు కోస్ట్కోకు ఇచ్చేందుకు 80లక్షల డాలర్ల విలువ చేసే వజ్రాలను కోరాడని డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయం తెలిపింది. చివరకు ఎల్‌ఎల్‌డీ మోసాని తెలుసుకొని మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, లేదంటే వజ్రాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అయితే ఎల్‌ఎల్‌డీ గుర్తించే లోపే వజ్రాలను విక్రయించడంతో పాటు మొత్తాన్ని ఖర్చు పెట్టినట్లు మాన్హాటన్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయం పేర్కొంది.


logo