గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 02:12:48

కరంటు తీగల కాటు

కరంటు తీగల కాటు
  • బస్సుకు విద్యుత్‌ వైర్లు తగిలి 10 మంది మృత్యువాత
  • 22 మందికి గాయాలు
  • నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘటన.. ఒడిశాలో విషాదం

బెర్హంపూర్‌, ఫిబ్రవరి 9: ఒడిశాలోని గంజాం జిల్లాలో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకున్నది. బస్సుకు విద్యుత్‌ తీగలు తగులడంతో విద్యుదాఘాతానికి గురై పది మంది మృత్యువాతపడ్డారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఎంకేసీజీ వైద్య కళాశాల, దవాఖాను తరలించారు. 40 మంది ప్రయాణికులతో కూడిన బస్సు జంగల్‌పాడు నుంచి చికరాడాకు వెళ్తుండగా, మందరాజపూర్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.  ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. బస్సులో ఉన్నవారంతా నిశ్చితార్థ వేడుకకు వెళ్తున్నట్లు బెర్హంపూర్‌ సదర్‌ సబ్‌డివిజినల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ (ఎస్‌డీపీవో) జయంత్‌ కుమార్‌ తెలిపారు. 11కేవీ విద్యుత్‌ లైన్‌కు బస్సు లగేజీ క్యారియర్‌ తగులడంతో బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రాణనష్టం పెరిగింది. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడినవారికి ఉచిత వైద్యం అందించనున్నట్లు తెలిపారు. 


దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పద్మానంద బెహరా చెప్పారు. ఘటనపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కూడా విచారం వ్యక్తంచేశారు. ఈ విషాదంపై దర్యాప్తు జరిపించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. మంటలను ఆర్పివేసి, బస్సులో ఉన్నవారిని సమీప దవాఖానకు తరలించినట్లు చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సుకంత్‌ సేథి తెలిపారు. ఇరుకైన మార్గంలో బస్సు డ్రైవర్‌ ద్విచక్ర వాహనానికి దారి ఇచ్చే ప్రయత్నంలో బస్సు లగేజి క్యారియర్‌కు విద్యుత్‌ తీగలు తగులడంతో ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఘటనపై విచారణ ప్రారంభించామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పినాక్‌ మిశ్రా తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విద్యుత్‌ సరఫరా సంస్థ ‘సౌత్‌కో’ విచారణ జరుపుతుందని పేర్కొన్నారు. ఒడిశా విద్యుత్‌ ట్రాన్‌స్మిషన్‌ కార్పొరేషన్‌ (ఓపీటీసీఎల్‌) సీఎండీ సౌరవ్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ లైన్‌ ఎత్తుతో సహా అన్ని అంశాలపై సమగ్ర నివేదిక అందజేయాలని సౌత్‌కో ఆదేశించినట్లు చెప్పారు.


logo