మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 20, 2020 , 17:06:41

జేడీయూ అభ్య‌ర్థిగా బీఆర్ మండ‌ల్ మ‌నువడు

జేడీయూ అభ్య‌ర్థిగా బీఆర్ మండ‌ల్ మ‌నువడు

హైద‌రాబాద్‌: అత‌ని మిత్రులు ఆయ‌న్ను నోకియా అని ముద్దుగా పిలుస్తారు.  నోకియా ఫోన్ ట్యాగ్‌లైన్ గుర్తుందా మీకు.  క‌నెక్టింగ్ పీపుల్ ఆ ఫోన్ స్లోగ‌న్‌.  నిఖిల్ మండ‌ల్‌ను అత‌ని స్నేహితులు నోకియా అని పిలుస్తార‌ట‌.  బీహార్ మాజీ సీఎం బీపీ మండ‌ల్ మ‌నువ‌డే నిఖిల్ మండ‌ల్‌.  రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న జేడీయూ పార్టీ త‌ర‌పున బ‌రిలో నిలుచున్నారు.  వెనుక‌బ‌డిన త‌రుగ‌తుల చైర్మ‌న్ బీపీ మండ‌ల్‌ను అంద‌రూ మండ‌ల్ క‌మిష‌న్‌గా గుర్తించే విష‌యం తెలిసిందే.  నిఖిల్ తాత‌య్య బీపీ మండ‌ల్ ఓ ద‌శ‌లో భార‌త రాజ‌కీయాల‌ను శాసించారు.  అయితే మాదేపురా నియోజ‌క‌వ‌ర్గం నుంచి నిఖిల్ రాజ‌కీయ అరంగేట్రం చేస్తున్నారు.  

వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల ప్ర‌జ‌ల అభ్యున్న‌త కోసం తన తాత‌య్య కృషి చేశార‌న్న విష‌యం త‌న‌కు తెలుసు అని నిఖిల్ మండ‌ల్ తెలిపారు.  త‌న తండ్రి కూడా నాలుగు సార్లు పోటీ చేసి.. రెండు సార్లు గెలిచార‌న్నారు.  పాట్నా నుంచి మెట్రిక్యులేష‌న్‌, ఆ త‌ర్వాత ఢిల్లీ వ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన‌ట్లు నిఖిల్ తెలిపారు. ఎంబీఏ, సోషియాల‌జీ, లా లో పీజీలు కూడా చేసిన‌ట్లు చెప్పార‌త‌ను. 2005 నుంచి బీహార్‌లో త‌న తండ్రికి స‌హ‌క‌రిస్తున్న‌ట్లు నిఖిల్ తెలిపారు.  తాను 9 ఏళ్లు ఉన్న‌ప్పుడు మండ‌ల్ క‌మిష‌న్ ఉద్య‌మం సాగింద‌ని, ఆ స‌మ‌యంలో ఇంటిని పోలీసులు 15 రోజుల పాటు చుట్టుముట్టార‌ని నిఖిల్ గుర్తు చేశారు. ఆ త‌ర్వాత మండ‌ల్ క‌మిష‌న్ గురించి లోతుగా స్ట‌డీ చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  

ఆర్థికంగా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల వారికి ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ తీసుకు వ‌చ్చిన మోదీ ప్ర‌భుత్వం ప‌ట్ల నిఖిల్ త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. మండ‌ల్ క‌మిష‌న్ నివేదిక అమ‌లు త‌ర్వాత దేశంలో చాలా మార్పులు జ‌రిగిన‌ట్లు తెలిపారు.  వెనుక‌బ‌డిన వ‌ర్గాల వాళ్లు ఉన్న‌త వ‌ర్గాల ఇండ్ల‌లో కీల‌క పాత్ర పోషించిన‌ట్లు చెప్పారు.  ఒక‌ప్పుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ బీసీల గురించి మాట్లాడేవార‌ని, కానీ ఆ త‌ర్వాత ఆయ‌న కేవ‌లం యాద‌వ్‌ల గురించి మాట్లాడార‌ని, ఆ త‌ర్వాత త‌న కుటుంబానికే ప‌రిమితం అయ్యార‌ని నిఖిల్ విమ‌ర్శించారు. 

బీహార్‌లోని యాద‌వ్‌ కుటుంబాలు కూడా జేడీయూకే మ‌ద్ద‌తు ఇస్తున్నాయ‌ని, షేర్‌-ఏ-బీహార్ బిరుదు ఉన్న రామ్ ల‌ఖ‌న్ సింగ్ యాద‌వ్ మ‌నువ‌డు జై వ‌ర్ధ‌న్ యాద‌వ్‌, మాజీ సీఎం ద‌రోగా ప్ర‌సాద్ రాయ్ కుమారుడు చంద్రికా రాయ్‌లు కూడా జేడీలో చేరిన‌ట్లు నిఖిల్ గుర్తు చేశారు. ఈ సారి జేడీయు నుంచి 20 మంది యాద‌వ్‌లు జేడీయూ టికెట్‌పై పోటీ చేస్తున్న‌ట్లు నిఖిల్ వెల్ల‌డించారు.