మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 20:30:39

గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది: కేరళ సీఎం

గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది: కేరళ సీఎం

తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తున్నదని కేరళ సీఎం పినరాయి విజయన్ తెలిపారు. ఇందులో తమ రాష్ట్ర పోలీసుల పాత్ర ఏమి ఉండబోదని ఆయన చెప్పారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేశ్‌కు చెందిన నకిలీ సర్టిఫికెట్‌పై శనివారం ఫిర్యాదు వచ్చిందని, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తారని వివరించారు. మరోవైపు శనివారం కూడా రాష్ట్రంలోని పలు చోట్ల ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయని సీఎం విజయన్ తెలిపారు. ఇకపై ఇలాంటివి సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఈ నెల 5న తిరువనంతపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి విమానంలో గోల్డ్‌ను అక్రమంగా రవాణా చేసిన ఈ వ్యవహారం సీఎం పినరాయి విజయన్‌ను చిక్కుల్లో పడేసింది. ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన ఒక అధికారిణికి ఈ వ్యవహారంతో సంబంధమున్నట్లు ఆరోపణుల వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖ ప్రధాన కార్యదర్శిని ఇటీవల ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అయితే గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారానికి బాధ్యత వహించి సీఎం విజయన్ తన పదవికి రాజీనామా చేయాలని కేరళలోని ప్రతిపక్ష యూడీఎఫ్‌తోపాటు బీజేపీ డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతున్నాయి.

మరోవైపు కేరళ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న బంగారం కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం కింద శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సరిత్, స్వప్న ప్రభా సురేష్, ఫాజిల్ ఫరీద్, సందీప్ నాయర్ తదితరులపై కేసులు నమోదు చేసింది.

logo