శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 21:24:28

పటాకులను నిషేధించాలని కేంద్రానికి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసు

పటాకులను నిషేధించాలని కేంద్రానికి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసు

న్యూఢిల్లీ : ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వాడకాన్ని నిషేధించాలనే దానిపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. వాయుకాలుష్యాన్ని నివారించడంలో భాగంగా ఈ నెల 7 నుంచి 30 వరకు టపాసులు కాల్చడంపై నిషేధించం విధించాలన్న ఆలోచనపై ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతోపాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతోపాటు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ), ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, ఢిల్లీ పోలీసు కమిషనర్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు పంపారు. ఈ విషయంలో అమికస్ క్యూరీగా సహాయపడటానికి ఎన్జీటీ సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వానీ, న్యాయవాది శిభానీ ఘోష్‌ను ఎన్జీటీ నియమించింది.

కొవిడ్‌-19 మహమ్మారి తీవ్రత కారణంగా గాలి నాణ్యత సంతృప్తికరంగా లేని సమయంలో టపాసులను కాల్పడం ద్వారా కాలుష్యం పెరిగిపోతుందని, దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సంతోష్ గుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన ఇండియన్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ నెట్‌వర్క్ చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ విచారించింది. పండుగ సమయంలో వాయు కాలుష్యం కారణంగా కొవిడ్‌-19 కేసులు పెరుగుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రి, ఢిల్లీ ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటనను ఈ పిటిషన్‌కు జత చేశారు. 

ఇలాఉండగా, ఎంపిక చేసిన 800 బహిరంగ ప్రాంతాల్లోనే టపాసులు కాల్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్చలు తీసుకుంటుండగా.. కరోనా వైరస్‌ సంక్రమిత పేషెంట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది టపాసులు కాల్చడంపై రాజస్థాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.