గురువారం 26 నవంబర్ 2020
National - Nov 12, 2020 , 15:25:59

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా దీదీకి సవాళ్లు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా దీదీకి సవాళ్లు

కోల్‌కతా : వచ్చే ఏడాది జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. క్లిష్ట సమయంలో అండగా ఉండాల్సిన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోమారు అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నా మమతా బెనర్జీకి.. మంత్రుల రూపంలోనే తలనొప్పులు మొదలయ్యాయి.  మమతా బెనర్జీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఐదుగురు మంత్రులు దూరంగా ఉండటంతో తృణమూల్‌ కాంగ్రెస్‌లో కలకలం మొదలైంది. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తృణమూల్‌ కాంగ్రెస్‌లో తిరుగుబాటు ప్రారంభమైనట్లుగా తెలుస్తున్నది. నిన్నటి క్యాబినెట్‌ సమావేశానికి ఐదుగురు మంత్రులు గైర్హాజరు కావడంతో.. తృణమూల్‌ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి గత కొన్ని నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పలు కార్యక్రమాలను అధికార పార్టీ బ్యానర్ లేకుండానే నిర్వహించడం పట్ల సువేందు పార్టీ మారతారన్న వార్తలకు బలం చేకూరుతున్నది. రాజీవ్ బెనర్జీ, గౌతమ్ దేబ్‌, రవీంద్రనాథ్ ఘోష్, పార్థా ఛటర్జీలు కేబినెట్ సమావేశానికి డుమ్మాకొట్టారు. గౌతమ్ దేబ్, రవీంద్రనాథ్ ఘోష్‌లకు కరోనా సోకినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్థా ఛటర్జీ ఒక్కరే ఆరోగ్యం బాగోలేదని సమాచారం ఇచ్చినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. రాజీవ్‌ బెనర్జీ గైర్హాజరుకు ఇంకా కారణం తెలియరాలేదు. ఏది ఏమైనా, ఐదుగురు మంత్రులు ఏకకాలంలో గైర్హాజరు కావడం ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ ప్రభుత్వంలో అసంతృప్తి ప్రారంభమైందని తెలుస్తున్నది.

ప్రారంభమైన బీజేపీ బెంగాల్ మిషన్

భారతీయ జనతా పార్టీ మిషన్ బిహార్ పూర్తవడంతో.. పశ్చిమ బెంగాల్‌పై కన్ను వేసింది. బిహార్ విజయం అనంతరం చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని సూచకప్రాయంగా వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలను హత్య చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రస్తావన ఇప్పుడు అర్థం చేసుకోవాలని, బిహార్‌లో మాదిరి విజయం కోసం పశ్చిమ బెంగాల్‌ కార్యకర్తలు ఉత్సహంగా ఉన్నారని మోదీ అన్నారు. ప్రధాని ప్రకటన నుంచి వచ్చిన సందేశం పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ కార్యకర్తలతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రజలకు కూడా చేరింది. ప్రధాని ప్రకటనను తృణమూల్ కాంగ్రెస్‌ను కూడా తాకిందనే చెప్పాలి.  దీనిని బట్టి పశ్చిమ బెంగాల్ గురించి బీజేపీ ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవచ్చు. 'చాణక్య' హోంమంత్రి అమిత్ షా స్వయంగా మిషన్ పశ్చిమ బెంగాల్‌కు నాయకత్వం వహిస్తున్నారు. 

దుర్గాపూర్‌లో తృణమూల్ కార్యకర్తల ఘర్షణ

ఇలాఉండగా, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలు ఘర్షణకు దిగారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కార్యకర్త కాల్చి చంపబడగా.. మరో ఇద్దరు కార్యకర్తలకు గాయాలైనట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.