శనివారం 11 జూలై 2020
National - Jun 22, 2020 , 20:28:39

ఆస్ప‌త్రికి 50 బెడ్లు విరాళంగా ఇచ్చిన నూత‌న జంట‌

ఆస్ప‌త్రికి 50 బెడ్లు విరాళంగా ఇచ్చిన నూత‌న జంట‌

ముంబై : ఓ నూత‌న జంట వినూత్నంగా ఆలోచించింది. త‌మ పెళ్లి వేడుక‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించుకోకుండా.. ఆ ఖ‌ర్చుతో త‌మ వంతు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే స‌హాయం చేయాల‌ని ఆ నూత‌న దంప‌తులు నిర్ణ‌యించుకున్నారు. లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌కు మేర‌కు వివాహం చేసుకుని.. ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి 50 బెడ్లు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌తో పాటు ఇత‌ర వ‌స్తువుల‌ను విరాళంగా ఇచ్చింది.  

నాద‌క్క‌ల్ గ్రామానికి చెందిన ఎరిక్ అంటోన్ లోబో(28), మెర్లిన్(27) ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ పెళ్లికి కేవ‌లం 22 మంది అతిథులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. పెళ్లి వేడుక అయిపోగానే.. స‌త్పాలా గ్రామంలో కొవిడ్-19 సేవ‌లందిస్తున్న ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ ఆస్ప‌త్రికి అవ‌స‌ర‌మ‌య్యే 50 బెడ్ల‌ను, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను విరాళంగా ఇచ్చి గొప్ప మ‌న‌సును చాటుకున్నారు.  ఇవే కాకుండా పిల్లో క‌వ‌ర్లు, బెడ్ షీట్స్, ఇత‌ర వ‌స్తువుల‌ను ఇచ్చారు. 

అయితే ఇదే విష‌యాన్ని నెల రోజుల ముందే స్థానిక ఎమ్మెల్యే ఠాకూర్ కు ఈ నూత‌న జంట చెప్పారు. త‌మ‌కున్న ఆలోచ‌న‌ను ఆ ఎమ్మెల్యేకు వివ‌రించారు. ఆయ‌న స‌హ‌కారంతో బెడ్ల‌ను త‌యారు చేయించారు. నాణ్య‌త‌తో కూడిన ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. పాల్గ‌ర్ జిల్లాలో 3 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 


logo